Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

No Alternative Medicine: ఇంగ్లీషు వైద్యం ఖరీదైపోయింది. అందుకే ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియో, ఎలక్ట్రో హోమియో, రేకీ , నాటు వైద్యం పేర్లతో పిలవబడే వైద్యాలను ప్రోత్సహించాలనే వాదం బాగా వినబడుతోంది.

వైద్యాన్ని ఇన్ని పేర్లతో పిలవాలా? ఇంగ్లీషు వైద్యం లేదా అల్లోపతీ అనే దాన్ని ఒక వైద్య విధానంగానూ, మిగతావన్నీ ప్రత్యామ్నాయ వైద్య విధానాలుగా పిలుచుకోవాలా?

500 సంవత్సరాల క్రితం వరకు మానవుడి శరీరనిర్మాణం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. మృతదేహాలను కోసి చూసిన తరువాతే  ‘దేహనిర్మాణ శాస్త్రం (Anatomy)’ మనకు అర్ధం అయింది.  అనేక పరిశోధనల అనంతరం ‘దేహ ధర్మాలు ( జీర్ణక్రియ, శ్వాసక్రియ, మెదడు, గుండె ఎలా పనిచేస్తాయో వగైరాలూ – Physiology)’ అర్ధం అయ్యాయి.

రోగాలు వచ్చినప్పుడు దేహంలో ఏం మార్పులు వస్తాయో మరిన్ని పరిశోధనల ద్వారా తెలిశాయి(Pathology). గాలిలో సూక్ష్మ జీవులు ఉన్నాయని తెలిసింది 160 సంవత్సరాల క్రితమే. వాటి ద్వారా వచ్చే జబ్బులు, రాకుండా ఏం చేయాలో, వస్తే ఏం చేయాలో తెలిసింది ఆ తర్వాతే (Microbiology).

వందేళ్ళ క్రితం వరకూ యాంటీబయాటిక్స్ అనే మందులే లేవు. మొట్ట మొదటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ ను 1942 లో ఉపయోగించారు. ఇప్పుడు మనం వాడే మందులన్నీ ఆ తర్వాత కనిపెట్టినవే (Pharmacology).

మరి అంతకముందు వైద్యం లేదా?
ఇంగ్లీషు వైద్యానికి ముందు మన వాళ్ళు మందులేమీ వాడలేదా? వాడితే ఏం వాడారు? ఏ దేహధర్మాల ఆధారంగా వాడేవారు?

పరిణామ క్రమంలో మనిషి పుట్టినప్పటి నుండీ బాధలు, జబ్బులు ఉండే ఉంటాయి కదా! తలనొప్పి, పంటి నొప్పి, దగ్గు, జ్వరం, దేహానికి దెబ్బలు, కాళ్ళు చేతులు విరగడాలూ అన్నీ ఉంటాయి గదా! ఇంత ఎక్కువగా కాకపోయినా గుండెపోట్లు, షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు కూడా ఉండే ఉంటాయి!

మరి వీటన్నింటినీ భరిస్తూ ఉండరు కదా? ఏదో ఒక వైద్యం చేసుకోకుండా బాధలు పడరు కదా? మొట్ట మొదటి మనిషే ‘మొదటి వైద్యుడు’. మొట్ట మొదటి ఆడమనిషే ‘మొదటి నర్సు’.  అప్పట్నుండీ మానవుల బాధలను తగ్గించడానికి తమకు తెలిసిన, కనిపెట్టిన ప్రక్రియలను ఉపయోగిస్తూనే ఉన్నారు!

గ్రీకులు, రోమన్లు, చైనీయులు, అరబ్బులు, భారతీయలు ఎక్కడి సమూహాలు అక్కడ వారి అనుభవంలో నేర్చుకొన్న విధానాల ఆధారంగా మనుషుల బాధలను తగ్గించడానికి వైద్యం చేస్తూనే ఉన్నారు.

యూరప్ లో ‘గేలన్’ (130 – 205 AD) అనే ఆయన ప్రతిపాదించిన వైద్య సిద్ధాంతం ఆధారంగా 1500 సంవత్సరాలు పాటు వైద్యం జరిగింది. ‘వెసాలియస్’ దేహ నిర్మాణాన్ని (Anatomy), ‘విలియం హార్వే’ దేహ ధర్మాల్ని (Physiology) శాస్త్రీయంగా అధ్యయనం చేసే వరకూ గేలన్ సిద్ధాంతం ప్రకారమే వైద్యం జరిగింది.

ఆధునిక వైద్య విధానం ఆ తర్వాతే అభివృద్ధి చెందింది. జబ్బుల కారణాలు, దేహంపై వాటి ప్రభావాలు, ఉపశమనం ఇవ్వగల మందులు, శస్త్ర చికిత్సలు కనిపెట్టబడ్డాయి.

మానవుడి ఆయుర్దాయం 100 – 110 సంవత్సరాలు. అయితే 100 సంవత్సరాల క్రితం వరకూ సగటు ఆయుర్దాయం 30-40 సంవత్సరాల మధ్యనే ఉండేది. ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాలలో సగటు ఆయుర్దాయం 80 సంవత్సరాలకు పైగా ఉంటే, మన దేశంలాంటి వాటిలో 60 సంవత్సరాలకు పైగా ఉంది.
సగటు ఆయుర్దాయంతో పాటు Infant Mortality rate వంటి అనేక ఆరోగ్య సూచికలన్నింటిలో ఇంత అభివృద్ధికి కారణం ఎంతో మంది శాస్త్రజ్ఞుల కృషే!

Treatment Methods

అన్ని దేశాల పాత వైద్య విధానాల్నిలోని ఉపయోగపడే అంశాలను మిళితం చేసుకున్నదే ఆధునిక వైద్యం.

భారతదేశ వైద్యంలో  ‘సర్పగంధి’ వేళ్ళను కొన్ని శతాబ్దాలనుండి ఉపయోగిస్తున్నారు. ఈ వేళ్ళు నమిలితే కొంతమందికి ఆరోగ్యం మెరుగ్గా అనిపించేది. అలా ఎందుకనిపిస్తుందో తెలుసుకోవాలని 70 సంవత్సరాల క్రితం ప్రయోగశాలలో పరీక్షలు చేశారు. ఆ వేళ్ళలో 16 రకాల ఆల్కలాయిడ్స్ అనే కెమికల్స్ ఉన్నాయి. వాటిలో ఒక్కటి అయిన “రిసర్పిన్” అనే ఆల్కలాయిడ్ తీసుకున్న వారికి అధిక రక్తపోటు తగ్గుతోంది. మిగిలిన 15 ఆల్కలాయిడ్సుకు దేహానికి ఉపయోగపడే ప్రభావం ఏమీ లేదని తేలింది. ఇది తెలిసిన తర్వాత అందరికీ సర్పగంధి వేళ్ళు ‘మంచివి, నమలండి’ అని ఇస్తామా? అధిక రక్త పోటు ఉన్న వారికి మాత్రమే ఆ వేళ్ళలో నుంచి తీసిన ‘రిసర్పిన్’ అనే రసాయనాన్ని ఇస్తామా?

అనేక అనవసర కెమికల్స్ కలిగిన సర్పగంధి వేళ్ళను నమలమని సూచించినందుకు గతంలోని వైద్యులను వెక్కిరిస్తామా? తప్పు గదా!

ఆ కాలానికి వారికి తెలిసిన జ్ఞానాన్ని బట్టి కొన్ని బాధలకు కొన్ని వేళ్ళో, ఆకులో, పూలో, కాయలో, వాటినుంచి వచ్చిన కషాయాలో ఇచ్చేవారు. కాలక్రమేణా దేహ నిర్మాణం, దేహ ధర్మం, రసాయన శాస్త్రం మనకు ఇంకా బాగా అర్ధం అయినప్పుడు రోగాలకు సరైన కెమికల్స్ ను సరైన మోతాదులో ఇస్తున్నాము.

గతంలో ప్రపంచంలో ఉన్న వైద్యాలన్నింటినీ అధ్యయనం చేసి వడకొట్టినదే ‘ఆధునిక వైద్యం’. ఇంకా అనేక అధ్యయనాలు చేయాలి. కొత్త జబ్బులు విసిరే సవాళ్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

చరకుడు రాసిన ‘చరక సంహిత’, శుశ్రూతుడు రాసిన ‘శుశ్రూత సంహిత’ లనూ, ఆయుర్వేద, సిద్ధ, యునానీ మందులను ప్రభుత్వం ఆధ్వర్యంలో మరింత పరిశోధనలు జరగాలి.

ముక్కు తెగిపోయిన వారికి మళ్ళీ ముక్కును అమర్చే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు . క్రీస్తు పూర్వం మనదేశంలో శుశ్రూతుడు చేసిన ఈ శస్త్రచికిత్స Indian Forehead Rhinoplasty గా ప్రపంచంలో ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది.

పూరిల్లు – పెంకుటిల్లు – డాబా
మన తాతలు పాకల్లో బతికేవారు. ఆర్ధికంగా కాస్త అభివృద్ధి చెందిన తర్వాత పెంకుటిళ్లలోనికి మారారు. మరి కాస్త ఆర్ధిక స్దోమత కలిగిన వారు డాబాలు కట్టుకుంటున్నారు. డాబా మంచిది. ఆధునికం. రక్షణ ఎక్కువగా కల్పిస్తుంది. అందుకని మన తాతలను, వారి పూరిళ్ళను ఎగతాళి చేస్తామా? తప్పుకదా!
ఆ కాలానికి పూరిల్లు, ఈ కాలానికి డాబాలు.

Treatment Methods

ఆఖరి మాట :
మలేరియాకు వాడే ‘క్యినైన్’ సింకోనా చెట్టు బెరడు నుండీ తయారు చేసినది. ‘ఆర్టిమెసినిన్ ‘అనే మరో మలేరియా మందు చైనీస్ హెర్బల్ మెడిసిన్. గుండె జబ్బులలో వాడే ‘డిజిటాలిస్’ కూడా మొక్కల నుంచి తీసినదే .

గతంలో ప్రాచుర్యంలో ఉన్న అన్ని వైద్య విధానాలలోని ఉపయోగపడే అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించినదే ఆధునిక వైద్యం (Modern Medicine).
కాబట్టి ప్రత్యామ్నాయ వైద్య విధానం అనే దానికి అర్ధం లేదు.
కానీ ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన గత వైద్య విధానంలోని మందులను వాడుకునే స్వేఛ్చను ఎవరూ కాదనకూడదు.

– డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

(సామాజిక మాధ్యమాల నుండి స్వీకరించినది. వైద్యానికి సంబంధించి అందరూ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి…రచయితకు కృతజ్ఞతలతో…)

Also Read :

ఐసీఎంఆర్ ఇండియా విశ్లేషణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com