Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅసూయ సాధువు పరిపక్వత

అసూయ సాధువు పరిపక్వత

ఆయన ఒక జెన్ సాధువు. ఆయన చేసే ప్రసంగాలు ఎందరినో ఆకట్టుకునేవి. ఆయన బోధనలు వినడానికి జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. ఇది మరొక సాధువుకి గిట్టలేదు. జెన్ సాధువుపై అసూయ పెంచుకున్నారు. ఎలాగైనాసరే ఆయనను అందరి సమక్షంలో అవమానపరచాల నుకున్నారు.

ఓరోజు జెన్ సాధువు ప్రసంగిస్తున్న చోటుకి వెళ్ళిన “అసూయ సాధువు” ఆయనను పరువు తీయాలనుకున్నాడు. అక్కడ వందల మంది ప్రేక్షకులు ఉన్నారు.

జెన్ సాధువు ప్రసంగం రసవత్తరంగా సాగుతోంది. ద్వేషభావంతో ఉన్న “అసూయ సాధువు” ఉన్నట్టుండి లేచి నిల్చుని “అయ్యా! మీరేం చెప్పినా విని తల ఊపడానికి ఓ మేకల మందను మీ చుట్టూ కూర్చోపెట్టుకుంటే సరిపోదు. నన్నూ మీ మాటలతో మీరు చెప్పినట్టు నాతో చేయించాలి. అలా మీరు చేయించలేకపోతే మీరు ఓడిపోయినట్టే లెక్క” అని అన్నాడు అసూయ సాధువు.

జెన్ సాధువు ఓ చిన్ననవ్వు నవ్వి “సరేనండి. మీరిక్కడికి రండి” అన్నారు.

అసూయ సాధువు ఉన్న చోటు నుంచి జెన్ సాధువు వేదిక దగ్గరకు వెళ్ళాడు.

“ఒక్క రెండడుగులు వెనక్కు వెళ్ళండి” అన్నారు జెన్ సాధువు “అసూయసాధువు” ని!

జెన్ సాధువు చెప్పినట్టే అసూయ సాధువు రెండడుగులు వెనక్కు వెళ్ళాడు.

“నా వెనక నుంచీ వచ్చి ఎడమచేతి పక్కన నిలబడండి” అన్నారు జెన్ సాధువు.

అసూయ సాధువు అలాగే చేశాడు.

చేతులు కట్టుకోండి అని జెన్ సాధువు చెప్పిన మరుక్షణం అసూయ సాధువు చేతులు కట్టుకున్నాడు.

ఆత్మవిశ్వాసంతో తలపైకెత్తి నా కళ్ళల్లోకి సూటిగా చూడండి అన్నారు జెన్ సాధువు.

వెంటనే అసూయ సాధువు తలపైకెత్తాడు. జెన్ సాధువు కళ్ళల్లోకి చూసాడు.

ఇప్పుడు తల దించండి అన్నారు జెన్ సాధువు.

అసూయ సాధువు అలానే చేశాడు.

అప్పుడు జెన్ సాధువు “నేనేం చెప్తే అవన్నీ విని పొల్లు పోకుండా చేశారు. మంచిది. మీకిప్పుడు వినే పరిపక్వత వచ్చింది. ఇలాగే ఉండండి. ఇంతకన్నా ఇంకేం కావాలి” అని అనడంతోనే అసూయ సాధువు నోటంట మాట లేదు. తల దించుకుని అక్కడి నుంచీ వెళ్ళిపోయాడు.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్