విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ పనులు త్వరలోనే ప్రారంభిస్తానని, తెలుగు తేజం, ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి.వి. సింధు ప్రకటించారు. ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం 2 శాతం స్పోర్ట్స్ కోటా ఇవ్వడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఆమె మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సిఎం జగన్ సింధును అభినందించి, సన్మానించారు. సింధు తాను సాధించిన కాంస్య పతాకాన్ని జగన్ కు చూపించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్ కు వెళ్లేముందు సిఎం జగన్ తనను అభినందించి పతకం తీసుకురావాలని ఆశీర్వదించారని, పతకం తీసుకొచ్చి ఆయన్ను కలిశానని చెప్పారు. క్రీడలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, తనకు అభినందనలు అందించిన ప్రతి ఒక్కరికీ సింధు ధన్యవాదాలు తెలియజేశారు. 2024 పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణపతకం లక్ష్యంగా కష్టపడతానని సింధు వెల్లడించారు.
నేటి ఉదయం విజయవాడ చేరుకున్న సిందుకు గన్నవరం విమానాశ్రయంలో డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణ దాస్, మంత్రి అవంతి శ్రీనివాస్, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ డా.రజత్ భార్గవ, కలెక్టర్ జె.నివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,ఇతర అధికారులు, క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ తల్లిని కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ఒలింపిక్స్ కు వెళ్ళే ముందు కూడా దుర్గమ్మను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నానని, పతకం గెల్చిన తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనం కోసం వచ్చానని సింధు చెప్పారు.