Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్ఇకపై ‘ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ అవార్డు  

ఇకపై ‘ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ అవార్డు  

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్ఠాత్మక ఖేల్ రత్న అవార్డు పేరును మారుస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇప్పటివరకూ ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డును ఇకపై ‘ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ అవార్డుగా పిలుస్తారు.  ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఖేల్ రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెడుతున్నామన్నారు. ఈ విషయంలో తమ అభిప్రాయాలు వెల్లడించిన ప్రతి ఒక్కరికీ అయన ధన్యవాదాలు తెలిపారు.

1905 ఆగస్ట్ 05న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ (నాటి అలహాబాద్)లో జన్మించిన ధ్యాన్ చంద్ 1926 నుంచి 1949 వరకు దాదాపు 24  ఏళ్ళపాటు భారత హాకీ జట్టుకు ప్రాతినిద్యం వహించారు. 1928 (ఆమ్ స్టర్ డామ్), 1932(లాస్ ఏంజిలిస్), 1936 (బెర్లిన్) ఒలింపిక్స్ లో మన హాకీ జట్టు స్వర్ణపతకం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. జాతీయ జట్టు తరఫున మొత్తం 185 మ్యాచ్ లు ఆడిన ధ్యాన్ చంద్  570 గోల్స్ సాధించారు. 1922 నుంచి 1956 వరకు బ్రిటిష్-ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి మేజర్ గా రిటైర్ అయ్యారు. 1979 డిసెంబర్ 3న తన 74వ ఏట అనారోగ్యంతో కన్నుమూశారు.

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేవారికి ఇచ్చే ఈ అవార్డును 1991 లో ప్రవేశ పెట్టారు. దీనికింద ఓ మెడల్, సర్టిఫికేట్ తో పాటు 25 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. ఇప్పటివరకూ మొత్తం 43 మంది ఈ అవార్డుకు ఎంపిక కాగా, మొదటి అవార్డు ను విశ్వనాథన్ ఆనంద్ అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కరణం మల్లీశ్వరి, గోపీచంద్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, ఫై.వి. సింధులు ఖేల్ రత్న అవార్డులు గెల్చుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్