పాకిస్తాన్ ఆసియా కప్ క్రికెట్ -2022 ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్ లో శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఆఫ్ఘన్ ను 129 పరుగులకే కట్టడి చేసినా ఈ లక్ష్యాన్ని సాధించడానికి పాక్ తుది వరకూ చెమటోడాల్సి వచ్చింది. చివరి ఓవర్లో 11 పరుగులు కావాల్సి ఉండగా పాక్ బౌలర్ నషీమ్ షా బ్యాట్ తో తన సత్తా చాటి మొదటి రెండు బంతులను సిక్స్ లుగా మలిచి అపూర్వ విజయం అందించాడు.
షార్జా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘన్ జట్టులో ఇబ్రహీం జర్డాన్-35; ఓపెనర్ హజ్రతుల్లా జాజాయ్-21; రషీద్ ఖాన్-18; గుర్జాబ్-17; కరీం జనత్ -15; నజీబుల్లా-10; అమ్జతుల్లా-10 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో హారిస్ రాఫ్ రెండు; నసీమ్ షా, మొహమ్మద్ హుస్నాన్, నజాజ్, షాదాబ్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాక్ 45పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. బాబర్ ఆజమ్ డకౌట్ కాగా, ఫఖర్ జమాన్-5; రిజ్వాన్-20 పరుగులు చేశారు. షాదాబ్ ఖాన్-36; ఇఫ్తికార్ అహ్మద్-30పరుగులతో రాణించారు. 8 బంతుల్లో 2 సిక్సర్లతో 16 పరుగులు చేసిన ఆసిఫ్ అలీ 19వ ఓవర్ ఐదో బంతికి ఔటయ్యాడు. 19 ఓవర్లకు 119 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయిన దశలో చివరి ఓవర్లో నసీమ్ షా జూలు విదిల్చి గెలిపించాడు.
36 పరుగులతో పాటు ఒక వికెట్ సాధించిన షాదాబ్ ఖాన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : Asia Cup: లంక చేతిలో ఇండియా ఓటమి