ఆసియా కప్ క్రికెట్ సూపర్ 4 మ్యాచ్ ల్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. లాహోర్ లోని గడ్డాఫి స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పరుగుల ఖాతా తెరవకముందే ఓపెనర్ మెహిదీ హాసన్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ నయీమ్-20; లిట్టన్ దాస్-16; తౌహిద్ హ్రుదోయ్-2 కూడా త్వరగా పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్(53)- ముష్ఫిఖర్ రహీమ్(64) నాలుగో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వీరిద్దరూ ఔటైన తరువాత షమీమ్ హోస్సేన్-16; అఫీఫ్ హోస్సేన్-12 మాత్రమే చేయగలిగారు. 38.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ బౌలర్లలో హారిస్ రాఫ్ 4; నసీమ్ షా 3; షహీన్ ఆఫ్రిది, ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
పాకిస్తాన్ 35 పరుగుల వద్ద తొలి వికెట్ (ఫఖర్ జమాన్-20) కోల్పోయింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ 17 రన్స్ మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇమామ్ ఉల్ హక్ 84 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 రన్స్ సాధించి మూడో వికెట్ గా ఔటయ్యాడు. మొహమ్మద్ రిజ్వాన్-63….ఆఘా సల్మాన్-12 పరుగులతో అజేయంగా నిలిచి 39.3 ఓవర్లలోనే విజయం అందించారు.
నాలుగు వికెట్లు తీసిన పాక్ బౌలర్ హారిస్ రాఫ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.