రష్యా – ఉక్రెయిన్ యుద్ధం తగ్గుముఖం పట్టక పోవటంతో మూడో ప్రపంచ దేశాల్లో ఆహార కొరత అధికం అవుతోంది. ఇప్పటికే అనేక ఆఫ్రికా దేశాల్లో గోధుమ ధరలు పెరిగాయి. ఇదే కోవలో ఇప్పుడు పాకిస్థాన్ చేరింది. ద్రవ్యోల్భణం పెరగడంతో దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వాటిలో గోధుమ పిండి ధరలు మరీను.. దాని ధర తెలిస్తే మనమంతా దడుసుకోవాల్సిందే. గోధుమ పిండికి డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే కిలో పిండి కొనాలంటే అక్కడి ప్రజలు రూ.320 వెచ్చించాల్సిందే. దీంతో ప్రపంచంలోనే గోధుమ పిండి ధరలు అత్యధికంగా పాక్‌లోనే ఉన్నాయని పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) తెలిపింది.
దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో రూ.200 అధికమైన 20 కిలోల గోధుమ పిండి బస్తా ధర రూ.3200కు చేరింది. ఇక సింద్ హైదరాబాద్‌లో రూ.3040, ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్‌కోట్, ఖుజ్దర్‌లో 20 కిలోల బస్తాపై రూ.106, రూ.133, రూ.200, రూ.300 చొప్పున పెరిగాయి. వాటితోపాటు బహవల్పూర్, ముల్తాన్, సుక్కూర్, క్వెట్టా పట్టణాల్లో గోధుమపిండి ధరలు చుక్కలనంటాయి. దీంతో చక్కెర ధరల రూ.160కి పెరిగింది.
పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోంభంలో చిక్కుకున్నది. ప్రపంచంలోనే అతి తక్కువ నివాసయోగ్యమైన నగరం కరాచీ అనే విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో కరాచీ 169వ స్థానంలో నిలిచింది. లాగోస్, అల్జీర్స్, ట్రిపోలీ, డమాస్కస్ నగరాలు మాత్రమే దానికంటే తక్కువ స్థానంలో ఉండటం విశేషం. 2023కుగాను లండన్‌కి చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్ ఈ జాబితాను విడుదల చేసింది.