శ్రీలంకతో ఆ దేశంలో జరుగుతోన్న తొలి టెస్టులో పాకిస్తాన్ విజయానికి 83 పరుగుల దూరంలో ఉంది. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. గాలే లోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 312 పరుగులకు ఆలౌట్ కాగా, పాకిస్తాన్ 461 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. సౌద్ షకీల్ అజేయ డబుల్ సెంచరీ తో సత్తా చాటిన సంగతి తెలిసిందే.
నిన్న మూడో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన లంక వికెట్ నష్టపోకుండా 14 పరుగులతో నేటి ఆట మొదలు పెట్టి 279 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన ధనంజయ డిసిల్వా (122) రెండో ఇన్నింగ్స్ లోనూ 82 రన్స్ తో సత్తా చాటాడు. నిశాన్ మధుశంక-52; ఆర్ మెండీస్-42 స్కోరు చేశారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, నోమన్ అలీ చెరో 3; షహీన్ అఫ్రిది, ఆఘా సల్మాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
నేడు రెండో ఇనింగ్స్ పూర్తయిన తరువాత పాకిస్తాన్ విజయానికి 131 అవసరం కాగా నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 48 పరుగులకు మూడు వికెట్లు (అబ్దుల్లా షఫీక్-8; షాన్ మసోద్-7 నోమన్ అలీ- డకౌట్) కోల్పోయింది. ఇమామ్ ఉల్ హక్- 25; కెప్టెన్ బాబర్ అజామ్-6 పరుగులతో క్రీజులో ఉన్నారు.