పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ తొందరలోనే సౌదీ అరేబియా, చైనా దేశాల్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటి పర్యటనగా సౌదీఅరేబియాకు వెళ్ళటం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎవరు ప్రధానిగా ఉన్నా ముందుగా ఈ రెండు దేశాలనే ప్రసన్నం చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. అమెరికా నుంచి సాయం నిలిచిపోయాక పాక్ నాయకత్వానికి చైనా దేశమే దిక్కయింది. సహచర ముస్లిం దేశం కావటంతో మొదటి నుంచి సౌదీ అరేబియా పాకిస్తాన్ కు అండగా ఉంటూ అవసరం వచ్చినపుడల్లా ఆర్థిక సాయం చేస్తోంది.
ఇమ్రాన్ ఖాన్ హయంలోనే సౌదీ అరేబియా దేశం కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ కు ఆరు బిలియన్ల బైల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చింది. ఇప్పుడు షాబాజ్ పర్యటనలో ఏం సాధించుకు వస్తారో వేచి చూడాలి. రంజాన్ నేపథ్యంలో ఉమ్రః దర్శనం చేసుకొని సౌదీ నాయకత్వంతో షాబాజ్ చర్చలు జరుపుతారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీకి సౌదీ రాచకుటుంబానికి మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. 1990 అక్టోబర్ లో నవాజ్ షరీఫ్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినపుడు పాక్ విడిచి వెళ్లేందుకు సౌదీ రాచ కుటుంబమే సహకరించింది. ఇమ్రాన్ ఖాన్ కు టర్కీ తో సత్సంబంధాలు ఉండగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేతలకు సౌదీ అరేబియాతో స్నేహ సంభంధాలు ఉన్నాయి.
మరోవైపు షాబాజ్ చైనా పర్యటన మీద బీజింగ్ మీడియా హర్షం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ హయం కన్నా షాబాజ్ పాలనలో పాక్ – చైనా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని చైనా మీడియా కథనాలు ప్రచురించింది. గ్వదర్ ఓడరేవు, బలోచిస్తాన్ లో వివిధ గనుల లీజు చైనా సంస్థలతో ఉంది. దీంతో పాకిస్తాన్ ప్రధాని పదవిలో ఎవరు ఉన్నా ఆర్థికంగా చేయి చాచేందుకు చైనా పాలకులు, అక్కడి బహుళజాతి సంస్థలే పెద్ద దిక్కు.
Also Read : పాక్ లో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధనలు