పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ ఉపసభాపతి కాసిం సూరి తిరస్కరించటాన్ని పాక్ ఉన్నత న్యాయస్థానం తప్పు పట్టింది. ఖాసిం సూరి చర్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 కు విరుద్దమని ఖర ఖండీగా ప్రకటించింది. ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తదనంతర పరిణామాలపై కేసును సుమోటోగా స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం గత అయిదు రోజులుగా విచారణ జరిపి ఈ రోజు తీర్పు వెలువరించింది.
ఐదుగురు న్యాయమూర్తులతో సుప్రీం కోర్టు బెంచ్ ఈ కేసు విచారణ చేస్తోంది. ఈ బెంచ్ లో చీఫ్ జస్టిస్ ఉమర్ అట బందియాల్, జస్టిస్ మునీబ్ అక్తర్, జస్టిస్ ఐజజుల్ ఆహ్సన్, జస్టిస్ మజ్హర్ ఆలం, జస్టిస్ జమాల్ ఖాన్ మందోఖేల్ ఉన్నారు. ఈ రోజు కేసు విచారణ ప్రారంభం కాగానే దేశాధ్యక్షుడు ఆరిఫ్ అలవి తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉంటామని అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన కేవలం పది నిమిషాల్లో తన వాదనలు వినిపించి కోర్టు హాల్ నుంచి వెళ్ళిపోయారు.
పాకిస్తాన్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 2018లో ఇమ్రాన్ పాకిస్థాన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టాడు. పాకిస్థాన్ రాజకీయాల తీరునే మార్చేస్తానని రంగంలోకి దిగాడు. కానీ గద్దెనెక్కిన దగ్గర నుంచి అటు సైన్యంతోనూ, ఇటు విపక్షాలతోనూ దోబూచులాటలకే పరిమితమయ్యాడు. ఇచ్చిన వాగ్దానాలేవీ నెరవేర్చలేదు సరికదా. పాకిస్థాన్ ను అప్పుల కుప్పగా మార్చేసిన ఫెయిల్యూర్ ప్రధానిగా ముద్ర పడ్డాడు. ఇప్పుడు పతనపుటంచుల్లో ఉన్న ఇమ్రాన్ కెరీర్ మళ్లీ రివైవ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పాకిస్థాన్ పొలిటికల్ గ్రౌండ్స్ లో ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ ముగిసినట్లే కనిపిస్తోంది.
Also Read : ఇమ్రాన్ ఖాన్ పాలనపై నిరసనలు