Pakistans Ambassador :
అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా మసూద్ ఖాన్ నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ మాజీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన మసూద్ ఖాన్ కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అమెరికా మీడియా పతాక శీర్షికల్లో ప్రకటించింది. మసూద్ ఖాన్ కరడు గట్టిన ఉగ్రవాది అని నేషనల్ రివ్యూ అనే పత్రిక ఎండగట్టింది. ఇస్లామిక్ జిహాదీలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది.
పాకిస్తాన్ లో పాలన గాడి తప్పింది అనేందుకు మసూద్ ఖాన్ నియామకమే నిదర్శనమని, ఇస్లామిక్ ఉగ్రవాదులకు నైతిక స్థైర్యం కల్పించేందుకే మసూద్ ను వాషింగ్టన్ పంపుతున్నరనే వార్తలు వస్తున్నాయి. హిజ్బుల్ ముజాహిద్దిన్ కు ఉగ్రవాది బుర్హాన్ వని ని జమ్మూ కశ్మీర్లో భారత సైనికబలగాలు మట్టు పెట్టినపుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి యువత ఉగ్రవాదం వైపు మళ్ళేలా ప్రసంగాలు చేశాడని అమెరికా నిఘా వర్గాలు అంటున్నాయి.
హిజిబుల్ ముజాహిద్దిన్ తో పాటు ఆయనకు అనేక ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలే ఉన్నాయి. హర్కత్ ఉల్ ముజహిద్దిన్ వ్యవస్థాపకుడు ఫజ్లుర్ రెహమాన్ ఖలిల్ తో కలిసి మసూద్ ఖాన్ 2019లో బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఈ సంస్థను 1997లో నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితాలో అమెరికా చేర్చింది. ఖలిల్ కు అల్ ఖైదా అధినేత ఒసామ బిన్ లాడెన్ తో స్నేహం ఉంది. అంతర్జాతీయ ఇస్లామిక్ ఫ్రంట్ ఏర్పాటులో లాడెన్ కు ఖలిల్ సహకారం అందించారు. 1998 లో అమెరికా మీద దాడులు చేయాలని లాడెన్ జారీ చేసిన ఫత్వాలో ఖలిల్ కూడా భాగస్వామ్యం ఉండటం గమనార్హం.
దక్షిణ ఆసియాలో హింసాత్మక కార్యకలాపాలు కొనసాగితున్న జమాత్ ఎ ఇస్లామి కి మసూద్ ఖాన్ గట్టి మద్దతుదారు. లేడీ అల్ ఖైదా పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆఫియా సిద్దికితో మసూద్ ఖాన్ కు మిత్రుత్వం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి సుస్థిరతలు నెలకొల్పాల్సిన సమయంలో పాకిస్తాన్, అమెరికా లు సమన్వయంతో పని చేయాల్సి ఉంది. ఈ తరుణంలో మసూద్ ఖాన్ ను అమెరికాకు పాక్ రాయబారిగా పంపటం ఎంతవరకు ఉపకరిస్తుందో వేచి చూడాలి.
Also Read : పాకిస్తాన్ పై అమెరికా ఆగ్రహం