Saturday, January 18, 2025
HomeTrending Newsవిస్తరిస్తున్న పాలస్తీనా ఆందోళనలు

విస్తరిస్తున్న పాలస్తీనా ఆందోళనలు

పశ్చిమాసియా సంక్షోభం కొత్త రూపు సంతరించుకుంటోంది. పాలస్తీనా పౌరులకు మద్దతుగా కేవలం గల్ఫ్ దేశాల్లో మాత్రమే జరుగుతున్న ఆందోళనలు అమెరికా, యూరోప్ కు విస్తరించాయి. అమెరికాలో మొదలైన పాలస్తీనా అనుకూల నిరసనలు యూరప్‌కు పాకాయి. తాజాగా పారిస్‌లోని సోబోన్‌ వర్సిటీ ఆవరణలో వందలాది మంది నిరసనకారులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలస్తీనా జెండాలు ఎగురవేస్తూ.. యుద్ధ బాధితులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలో పలు యూనివర్సిటీల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్నది.

మంగళవారం కొలంబియా వర్సిటీలో ఆందోళనకారులు హామిల్టన్‌ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వర్సిటీ ప్రధాన గేట్లకు అడ్డుగా బారికేడ్లను ఏర్పాటుచేసి, భవనం కిటికీలో నుంచి పాలస్తీనా జెండా ఎగురువేశారు. వర్సిటీల్లో భవనాల్ని స్వాధీనం చేసుకోవటం, ప్రధాన గేట్లను మూసేయటం, పాలస్తీనా జెండాలను ఎగురువేయటం.. వంటివి సోమవారం రాత్రి నుంచి మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో అమెరికా అంతటా వర్సిటీల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. నిరసన శిబిరాల నుంచి విద్యార్థులను తరలించటంపై వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. టెక్సాస్‌, ఉటా, వర్జీనియా, న్యూజెర్సీల్లో వందలాది మందిని పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది.

మరోవైపు హమాస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ తెగేసి చెపుతోంది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై తాము దాడి చేస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు. ఆరునూరైనా ఈ యుద్ధంలో విజయం సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. హమాస్‌తో కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్న క్రమంలో దానిపై ఒప్పందం కుదరినా, కుదరకపోయినా.. హమాస్‌ ఉగ్లరవాదులను అంతం చేయడానికి ఇజ్రాయెల్‌ దళాలు రఫాలోకి ప్రవేశిస్తాయన్నారు.

పాలస్తీనా అనుకూల నిరసనలు, ఇజ్రాయల్ హుంకరింపులతో ఇప్పట్లో ఉద్రిక్త వాతావారణం చల్లబడేలా లేదు. ఫ్రాన్స్ లో ముస్లిం జనాభా అధికం. ఈ తరుణంలో అక్కడ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరిగినా అవి ఐరోపా మొత్తం చుట్టుకునే ముప్పు పొంచి ఉంది. తద్వారా గొడవలు ప్రపంచానికి కొత్త సమస్యలు తెచ్చే ప్రమాదం ఎంతో దూరంలో లేదు.

-దేశవేని భాస్కర్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్