సినిమాలపైన .. బుల్లితెరపైన కె. బాలచందర్ వేసిన ముద్ర చెరిగిపోలేదు. ఒకప్పుడు బాలచందర్ ‘బుల్లితెర కథలు’ ఒక ప్రయోగంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏ ఎపిసోడ్ కథ ఆ ఎపిసోడ్ తోనే ముగుస్తుంది. ముగింపులో చిన్న ఛమక్కు ఉంటుంది. అది హాయిగా నవ్వించవచ్చు .. కన్నీళ్లు పెట్టించవచ్చు. ఒక రకంగా అదే పద్ధతిని ఇప్పటి వెబ్ సిరీస్ లు ఫాలో అవుతున్నాయని అనుకోవచ్చు. ఇప్పుడు అదే స్టైల్ తెలుగు తెరపైకి వచ్చిందనే విషయం ‘పంచతంత్రం‘ సినిమా చూస్తే అర్థమవుతుంది.
అఖిలేశ్ – సృజన్ నిర్మించిన ఈ సినిమాకి హర్ష పులిపాక దర్శకత్వం వహించాడు. బ్రహ్మానందం .. స్వాతి రెడ్డి .. సముద్రఖని .. శివాత్మిక .. దివ్య శ్రీపాద ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాలో ఐదు కథలు ఉంటాయి .. ఒక కథ తరువాత ఒక కథ నడుస్తుంది. ఒక కథకు మరో కథకు ఎలాంటి సంబంధం ఉండదు. కష్టాలను తట్టుకుంటూ .. చిన్న చిన్న ఆశలను చిగురింపజేసుకుంటూ, ఆ అనుభూతి పరిమళం అందించే ఆనందంతో జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలనేదే ఈ కథలోని సారం .. సారాంశం.
ఈ సినిమాలో మొత్తం ఐదు కథలుంటే మొదటి రెండు కథలు అంతగా ఆకట్టుకోవు. మిగతా మూడు కథల్లోని ఎమోషన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ మూడు కథల ముగింపు ఆడియన్స్ మనసులను టచ్ చేస్తాయి. బ్రహ్మానందం .. సముద్రఖని .. దివ్య శ్రీపాద నటన ఆకట్టుకుంటుంది. అయితే ఏ కథలోను ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ అంశాలు కనిపించవు. సినిమా కథల్లో కనిపించే కథనంలోని వేగం కనిపించదు. అలా నిదానంగా .. నింపాదిగా నడిచే కథలతో కలిసి ఆడిటోరియం ట్రావెల్ చేయడం కష్టమే. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైనే ఈ తరహా కథలు ఆకట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందనిపిస్తుంది.