Monday, May 13, 2024

ఏంపా! వింటివా?

History Repeats: ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తరువాత ఆ మధ్య హంపీ చూసి వచ్చాను. వారం, పది రోజులు హంపీ వెంటాడింది. చరిత్రలో ఆరేడు వందల ఏళ్ల వెనక్కు వెళ్లిపోయాను. అంతటి వైభవం హంపీది. ఏనుగు చచ్చినా బతికినా వెయ్యే. అలా హంపీ శిథిలమై ఇలా పడి ఉన్నా దాని గొప్ప దానిది.

కరెంటు, మోటారు పంపులు, వాటర్ హెడ్ ట్యాంకులు, కూలర్ ఫ్యాన్లు, లిఫ్ట్ ఇరిగేష్ బాహుబలి మోటార్లు, పైపులు, నీటి శుద్ధి యంత్రాలు ఏవీ లేని రోజుల్లో నీటి నిర్వహణ మీద విజయనగర ప్రభువుల శ్రద్ధ, ప్రణాళికలను చూస్తే ఇప్పటి అత్యాధునిక వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కంటే వారివే నయమనిపిస్తుంది. మూడు, నాలుగు కిలోమీటర్లు రాతి ఛానెల్స్ ద్వారా సహజంగా తుంగభద్ర నది నీరు హంపీ భవనాల్లోకి పల్లానికి ప్రవహించేలా వారు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో ఇప్పటి మన బుర్రలకు పెద్ద టెక్నాలజీ కనిపించకపోవచ్చు. కానీ…మంచి నీరు, సాగునీటి కోసం వారు చేసింది భగీరథ ప్రయత్నానికి తక్కువైనది మాత్రం కాదు.

విద్వాన్ విశ్వం పెన్నేటి పాటకు ముందు మాట రాస్తూ ప్రఖ్యాత పండితుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఒక మాటన్నారు.
విజయనగర ప్రభువులు తవ్వించిన గొలుసుకట్టు చెరువులే శతాబ్దాల తరబడి రాయలసీమకు సాగుబడి. అందుకే చాలా చెరువులకు, ఊళ్లకు బుక్కరాయసముద్రం, రాయల చెరువు, రాయసాగర్ లాంటి పేర్లు సార్థకమై స్థిరపడ్డాయి. ఎక్కడో ఆ గొలుసు తెగిపోయింది. రాయలసీమ గుండె చెరువయ్యింది.”

రెండు, మూడు వందల ఏళ్ల వెనక్కు వెళితే కావ్యాల్లో ఎక్కడా రాయలసీమ కరువుతో అల్లాడలేదు. పూలు, పళ్లతో ప్రకృతి మాత పచ్చని పట్టు చీరలు కట్టుకుని ఊరేగింది. ద్రాక్ష, అరటి తోటల వాసనలతో గాలి మత్తెక్కి తేలిపోయింది. నానా రుచులతో నాలుక నాట్యం చేసింది.

ఇవన్నీ కావ్యాల్లో కల్పనలు కాదు. నాలుగు వందల సంవత్సరాల కిందటిదాకా ఈ ప్రాంతాల్లో పర్యటించిన విదేశీ సందర్శకులు రికార్డు చేసిన విషయాలు.

ఇప్పుడు రాయలసీమ అంటే కరువు సీమ. చుక్క నీరులేక నెర్రెలు చీలిన నేల. పశువులకు గుడ్డి గడ్డి కూడా మొలవని ఎడారి. బతుకు తెరువుకోసం వలస వెళ్లే ఊళ్లు. పెన్నేటి బాట- కన్నీటి పాట.

కరువుకు కేరాఫ్ అడ్రస్, బ్రాండ్ అంబాసడార్ గా ముద్ర పడ్డ రాయలసీమలో మూడేళ్లుగా వద్దంటే వానలు. వరదలు. ముంపులు. జలదిగ్బంధనాలు.

దాంతో సీమ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. చివరికి “అనంతకు తుఫాను హెచ్చరిక” అని జిల్లా పేజీలో నాలుగు లైన్ల చిన్న వార్త వస్తే దాన్ని డి పి లుగా పెట్టుకుని, వాట్సాప్పుల్లో పులకించిన కామెంట్లతో షేర్ చేసుకుంటున్నారు. కొన్ని గ్రూపుల్లో ఈ వార్తకు గ్రామీణులు పెట్టుకున్న కామెంట్లను స్క్రీన్ షాట్లుగా నాకో మిత్రుడు పంపారు. అందులో కొన్ని:-

“అనంతకు తుఫాను అంట. మన జీవితంలో ఎప్పుడన్నా వినింటిమా? చూసింటిమా?”

“వస్తే రానీ. మన కరువుతీరా తుఫానే రానీ”

“కోస్తాకేనా తుఫాను? ఇదిగో మా జిల్లాకూ వస్తోంది!”

“అనంతపురంలో తుఫాను వస్తే పునరావాస సహాయ శిబిరాలు పెడతారంట!
అరే! సాంబా! రాసుకోరా!
సీమకు మంచి రోజులు వచ్చేసినాయిరా!”

“అనంతపూర్ అంటే పూర్ అనుకుంటివా?
నీళ్ళొక్కటి ఇట్లే వస్తే…ఫైర్ రా నాయనా!”

“ఏంపా ఓబులేసు!
యాడున్నావు?
బిరింగా రాప్పా! వచ్చి మిద్దెక్కు!
తుఫానంట…ఆమీటికి కిందికి దిగేకి అయ్యేల్లే…నీళ్లొస్తాయి!”

ఈ సంభాషణల్లో ఉన్నది తమాషా, సరదా, వ్యంగ్యం కాదు. తరతరాలుగా కళ్ళల్లో గూడు కట్టుకున్న కన్నీటి చుక్క. తరతరాలుగా గుండెల్లో గుచ్చుకున్న కరువు. అదిప్పుడు ఆనందంతో తుఫానుకు ఎదురెళుతోంది. తుఫానును పట్టి బంధించి ఇంట్లో పెట్టుకోవాలని ఎవరికి ఉంటుంది?
చుక్క నీటికోసం గుక్కపట్టి ఏడ్చినవారికి ఇలాగే ఉంటుంది.
ఉగ్గబట్టి దోసెడు నీళ్లకోసం అలమటించినవారికి ఇలాగే ఉంటుంది.
నీటి స్పర్శ కోసం జలస్వప్నాలు కన్నవారికి ఇలాగే ఉంటుంది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

http://sh100.global.temp.domains/~idhatric/1986-floods-a-tragedy-affect-on-godavari-districts/

Also Read :

http://sh100.global.temp.domains/~idhatric/chilukuri-narayana-rao-proposed-the-name-of-rayala-seema-in-andhra-maha-sabha-1928/

RELATED ARTICLES

Most Popular

న్యూస్