Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపానీపూరీ అమ్ముతూ ప్రభుత్వోద్యోగం

పానీపూరీ అమ్ముతూ ప్రభుత్వోద్యోగం

ప్రభుత్వోద్యోగం అంటే ఈ కాలం యువతకు చిన్నచూపు. త్వరగా ఎదిగిపోవాలని , డబ్బు సంపాదించాలని ఉంటోంది. అందుకే ఇంస్టాగ్రామ్ రీల్స్, ఇతర షార్ట్ కట్ దారులు వెతుక్కుంటూ ఉంటారు. చేసేది ఎంత చిన్న పని అయినా సెల్ ఫోన్ కి బానిసలవడం, ఇతరత్రా ఆశయాలు లేకపోవడం ఈ కాలపు యువతలో ముఖ్యంగా కనిపించే లక్షణాలు. ఒకటికి రెండింతలు కష్టపడితేనే ఉద్యోగం అంటే అటువైపు కూడా చూడటం లేదు. చిన్న పానీపూరీ బండి పెట్టుకున్నా ప్రభుత్వోద్యోగం కంటే ఎక్కువే సంపాదించవచ్చను కుంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా కృషి చేసిన ఒక యువకుడు పానీ పూరీ అమ్ముతూ ఇస్రోలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇందుకు అతను పడిన కష్టం మాములుగా లేదు.

మహారాష్ట్ర లో ఖైర్బోడి అనే చిన్న గ్రామానికి చెందినవాడు రాందాస్ హేమరాజ్ మార్బడే. తండ్రి ప్రభుత్వ పాఠశాలలో ప్యూన్. తల్లి గృహిణి. ఎంతగాకోరిక ఉన్నా పాఠశాల విద్య పూర్తయ్యాక ఆర్థికంగా సహకరించని స్థితి. అప్పుడు రాందాస్ ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి ఏదో ఒక పని చేసుకుంటూ బతికేయడం. రెండోది మరింత కష్టపడి కోరుకున్న స్థానం సాధించడం. రెండోదే ఎంచుకున్నాడు రాందాస్. బండి పైన ఊరూరు తిరుగుతూ పానీ పూరీ అమ్మేవాడు. రాత్రిపూట చదువుకునేవాడు. అలాగే ఇంటర్,డిగ్రీ పాసయ్యాడు. అప్పుడే అనిపించింది అతనికి సాంకేతిక విద్య చదివితే బాగుంటుందని. తిరోరా ఐటీఐ లో చేరి పంప్ మెకానిక్ కోర్స్ చేశాడు. అందులో భాగంగా సెంట్రి ఫ్యూగల్ పుంపులు, ఫిల్టరేషన్ సిస్టం నేర్చుకున్నాడు. ఇదే అతనికి ప్లస్ పాయింట్ అయింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అప్రెంటిస్ ట్రైనీలు కావాలని ప్రకటన ఇచ్చింది. 2023 లో జరిగిన రాతపరీక్షలో, ఆ తర్వాత శ్రీహరికోటలో జరిగిన టెక్నికల్ పరీక్ష లో విజయం సాధించాడు రాందాస్. 2025 లో ఇస్రో లో పంప్ ఆపరేటర్ కం మెకానిక్ గా ఎంపికయ్యాడు. దేశ అభ్యున్నతికి బాటలు వేసే సంస్థలో భాగమయ్యాడు. పానీ పూరీ నుంచి ఇస్రో వరకు సాగిన ఇతని ప్రయాణం నేటి యువతకు ఆదర్శం.

-కె.శోభ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular