Saturday, April 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహిందూపురం రుచులు

హిందూపురం రుచులు

Parijatha Dosa:  హిందూపురం చిరుతిళ్ళ గురించి, అక్కడి ప్రజలు ఈ తిండికి ఎలా దాసోహం అయ్యారన్న విషయాల గురించి ఇటీవలే ప్రస్తావించాను. దాని లింక్ ఈ కింద ఇస్తున్నాం…

ఈ ఆకలి తీరనిది

అయితే ఈ సందర్భంగా ఓ ముఖ్యమైన, అనివార్యంగా ప్రస్తావించాల్సిన ఓ అంశం గురించి చెప్పాలి.

ఎవరయినా హిందూపురం చరిత్ర రాస్తే- అందులో కొన్ని పేజీలు ఖచ్చితంగా పారిజాత హోటల్ గురించి రాయాలి. హిందూపూర్ – లేపాక్షి రోడ్డులో అమృత్ మహల్ ఎదురుగా పారిజాత హోటల్ ఇప్పుడు లేదు. కాలగర్భంలో కలిసిపోయింది. కానీ-50 ఏళ్లపాటు ఒక వెలుగు వెలిగిన పారిజాత హోటల్ గురించి చెబితే అర్థమయ్యేది కాదు. ఆ హోటల్లో తిన్నవారికి తప్ప మిగతావారికి దేశమంతా ఉన్న సవాలక్ష ఉడిపి హోటళ్లలో అదీ ఒకటి- అంతే.

ఉత్తర కర్ణాటక తీరప్రాంతం ఉడిపి దగ్గర హొన్నావర నుండి గణేష్ భట్ పొట్టచేతపట్టుకుని వచ్చి హిందూపురంలో పెట్టిన హోటల్ – పారిజాత. ఈరోజుల్లో ఉడిపి హోటళ్లు నిజంగా ఉడిపి బ్రాహ్మణులవేనా- కాదా అనేది ఎవరికి వాళ్లు పరిశోధించి తెలుసుకోవాల్సిన విషయం. కానీ- పారిజాత భట్ నిజమయిన ఉడిపి వారసత్వం ఉన్నవాడే. సాత్వికుడు. కష్ట జీవి. సంప్రదాయవాది. వివాదరహితుడు.

మాల్గుడి డేస్ హోటల్లా పారిజాత మరీ చిన్నది కాదు. మరీ పెద్దది కాదు. తెలతెలవారుతుండగా వాకింగుల ముసలి బ్యాచ్ పారిజాత ముందు కాఫీలు తాగడానికే వాకింగ్ చేసేవారు. ఉదయాన్నే వెన్నలాంటి ఇడ్లిలు. సాయంత్రం దాకా వడ, మసాలా దోసె, ఉప్మా, పూరి. సాయంత్రం మద్దూర్ వడ, మసాలా వడ, బజ్జి. రాత్రికి చపాతి ఉల్లిపాయ కూర.

హిందూపురానికి కొత్త అల్లుడొస్తే పారిజాత హోటల్ కు తీసుకెళ్లి తినిపించడం ఒక మర్యాద. బంధువులొస్తే పారిజాతకు వెళ్లడం సరదా. ఒక అవుటింగ్. ఆ రోజుల్లో హిందూపురంలో ఉన్నవే అయిదారు హోటళ్లు. వాటితో పారిజాతను పోల్చడానికి వీలే లేదు. మిగతావి కొన్ని మిలటరీ హోటళ్లు- అంటే నాన్ వెజ్.

పారిజాతలో మసాల దోసె తినడానికి హిందూపురం జనమే కాక, చుట్టుపక్కల 75 ఊళ్ల జనం ఒక పనిగా పెట్టుకుని వచ్చేవారు. లేదా హిందూపురంలో పనులన్నీ ముగించుకుని చివర పారిజాతాలో టిఫిన్ చేసి అప్పుడు ఊరికెళ్ళాలి.

పారిజాత మసాల దోసె ఎర్రకారం, బంగాళాదుంప కూర తినడం ఒక వ్యసనం. ఒక నోరూరే రుచి. రాత్రిళ్లు చపాతీ ఉల్లిపాయలు సన్నగా తరిగిన కూర రెండున్నర రూపాయలకు దొరికే అసాధారణమయిన ఫుడ్డు. ఒక్కొక్క ఐటెంది ఒక్కో రుచి. సాయంత్రాలు స్నాక్ ఐటెంగా మద్దూర్ వడ తిని కే టీ తాగితే జస్ట్ స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాం. పారిజాత ముందు కర్ణాటక నుండే వచ్చిన ఒకాయన పాన్ షాపు ఉండేది. విశ్వహిందూ పరిషత్ కార్యకలాపాల్లో ఆయన చురుకుగా ఉండేవాడు. బాలాజీ థియేటర్లో క్యాంటిన్ కూడా ఈ పాన్ షాపు ఆయనే నడిపేవాడు.

Parijatha Hotel

పారిజాత హోటల్ భట్ పెద్దవాడయ్యాడు. ఆయన పిల్లలూ పెద్దవారయ్యారు. కష్టార్జితంతో అమృత్ మహల్ దగ్గరే ఓ చిన్న షాపింగ్ కాంప్లెక్స్, దాని వెనక ఇల్లు కట్టుకున్నాడు. వయసు మీద పడుతోంది. వంటవాళ్లు దొరకడం లేదు. జనం కొత్త రుచులకు మరుగుతున్నారు. అప్పటికి 30 ఏళ్లుగా హోటల్ నడిపి నడిపి అలసిపోయాడు. ఒక శుభ ముహూర్తాన తన బంధువు వెంకట్ కు హోటల్ అప్పగించి, తను రిటైర్ అయ్యాడు. అమ్మాయికి పెళ్లి చేసి పంపాడు. అబ్బాయికి పెళ్లి చేశాడు. షాపింగ్ కాంప్లెక్స్ కూడా అమ్మేసుకుని మంగళూరులో అమ్మాయి దగ్గర స్థిరపడ్డాడు. వెంకట్ తెలివయిన ఈ కాలం పిల్లాడు. 20 ఏళ్లు హోటల్ నడిపాడు. వెట్టిచాకిరి హోటల్ కంటే రియల్ ఎస్టేట్ నయమనుకుని 2011లో ఒక రోజు హోటల్ ను శాశ్వతంగా మూసేశాడు. హిందూపురం రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తున్నాడు. వెంకట్ నాకు మంచి మిత్రుడు. హోటల్ మూసేయడానికి ఒక సంవత్సరం ముందు పని ఉండి నేను హిందూపురం వెళితే కలిశాడు. పారిజాతకు ఆహ్వానించాడు. దగ్గరుండి మసాలా దోసె వేయించి ఆప్యాయంగా వడ్డించాడు. అదే పారిజాతాలో నాకు నెమరువేసుకోవడానికి రుచిగా మిగిలిన జ్ఞాపకం దోసె.

Parijatha Hotel

పారిజాతాలో రుచి ఎంత గొప్పదో- భట్ సంస్కారం కూడా అంతే గొప్పది. మా నాన్న పండితుడు కావడంవల్ల ఆయన్ను గౌరవిచేవాడు. నేను జర్నలిస్టు కావడం వల్ల నన్ను కూడా అంతే గౌరవించేవాడు. అప్పుడు నా వయసు ఇరవై. పాండురంగనగర్ లో ఇంకా నిర్మాణంలో ఉన్న లయన్స్ క్లబ్ భవనంలో సంక్రాంతి కవి సమ్మేళనం. అప్పుడు ఆ ఊరిలో కవులు అని తమకు తాము అనుకునే పదిమందిలో నేనూ ఒకడిని. రెండు వందల మందికి కుర్చీలు వేస్తే- మూడు వందల మంది వచ్చారు. నాకు తరువాత తెలిసింది- కవి సమ్మేళనం తరువాత లంచ్ కు వచ్చిన కవితారస పిపాసులట వారు. ఆ కవి సమ్మేళనంలో నా కవిత విన్నానని, తానే కవిత రాసి చదివినట్లు పొంగిపోయి- ఆరోజునుండి కవిగా నన్ను గుర్తించి నాకు స్పెషల్ ట్రీట్ మెంట్ ఇచ్చిన సాహితీ పిపాసి పారిజాత భట్. కవిత్వం కూడు పెడుతుందా? అని ఏవగించుకుంటారు కానీ- నాకయితే భట్ ప్రేమను సంపాదించిపెట్టింది. అయితే జాతి విశాల ప్రయోజనాల దృష్ట్యా తరువాత ఆరేడేళ్ళకు నేను కవిత్వం రాయడం ఆపేయాల్సి వచ్చింది. అది ఇక్కడ అప్రస్తుతం.

యాభై ఏళ్లు ఒక ఊరికి రుచులు పంచిన పారిజాత హోటల్ ఇప్పుడు లేనందుకు బాధపడాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఉన్నందుకు ఆనందించాలి. భట్ ఆ హోటల్ బాధ్యతల నుండి తప్పుకోవడం, ఆయన బంధువు వెంకట్ ఆ హోటల్ ను శాశ్వతంగా మూసేయడం మంచి నిర్ణయమే. 30 – 40 ఏళ్ల హోటల్ నిర్వహణలో భట్ కు ఎప్పుడూ ఎవరితో గొడవల్లేవు. ఉన్నంతలో బాగానే సంపాదించాడు. తల ఎత్తుకుని గర్వంగా ఎవరి ముందూ ఏరోజూ నిలుచోకపోయినా, ఎవరి ముందూ ఎప్పుడూ తలదించుకోలేదు. రానున్న రోడ్డు సైడ్, ఫాస్ట్ ఫుడ్డును పదిహేను, ఇరవై ఏళ్ల ముందే ఊహించాడు. ఒక అధ్యాయానికి గౌరవంగా ముగింపు పలికాడు. హాయిగా కూతురు దగ్గర తాత హోదాను ఎంజాయ్ చేస్తున్నాడు.

హిందూపురం పారిజాతకు రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకోవాలంటే భట్ ను మంగళూరు నుండి ఒక రోజు హిందూపురానికి పిలిపించి మంచి మసాలా దోసెతో ఆతిథ్యమిచ్చి- “నీ పారిజాత రుచులను మేము మరచిపోలేదు. అలాంటి రుచి ఇప్పుడు లేదు. ఇక రాదు” అని చెప్పి గౌరవంగా తిప్పి పంపాలి.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్