Sunday, January 19, 2025
HomeTrending Newsపాకిస్తాన్ పై పష్టున్ ల ఆగ్రహం

పాకిస్తాన్ పై పష్టున్ ల ఆగ్రహం

ఆఫ్ఘనిస్తాన్ లో అశాంతితో సాధారణ ప్రజలు ఇరాన్, పాకిస్తాన్ దేశాలకు శరణార్ధులుగా వెళ్ళిపోతున్నారు. ఆఫ్ఘన్లో పరిణామాలు సరిహద్దు పాకిస్తాన్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాలిబాన్ లతో సహా దేశంలో ఎక్కువ జనాభా పష్టున్ తెగకు చెందినవారు. పాక్ లోని ఖైబర్ పఖ్తుంక్వ, బలూచిస్తాన్ రాష్ట్రాల్లో పష్టున్ జనాభా ప్రభావశీల వర్గంగా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు ఆఫ్ఘన్ దేశ ప్రజలతో బంధుత్వాలు, స్నేహం ఉండటంతో రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి. ఆఫ్ఘన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినా పంజ్ శీర్, హేరాత్ తదితర ప్రాంతాల్లో హజారాలు, ఉజ్బెక్ లపై  ఆధిపత్యం కోసం తాలిబాన్ మూకలు జరుపుతున్న దాడులు ఈ ప్రాంతాల్ని నిప్పుల కొలిమిలా మార్చాయి.

పాకిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్ ఉగ్రవాదులని రెచ్చగొట్టడం వల్లే మారణహోమం జరుగుతోందని పష్టున్ లు ఆగ్రహంతో ఉన్నారు. అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదానికి వ్యతిరేకం అంటూనే పాక్ నాయకత్వం ఆఫ్ఘన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబాన్ లను ప్రోత్సహించిందని మండిపడుతున్నారు. పాక్ విధానాలతో పష్టున్ కుటుంబాల్లో సుమారు తొంభై శాతం జనాభా మీద ఆఫ్ఘన్ అల్లర్ల ప్రభావం పడుతోందని పష్టున్ తఃఫుజ్ మూవ్మెంట్(పి.టి.ఎం.) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్ఘన్ గొడవల్లో భర్తలు చనిపోవటం, కుమారులు చనిపోయిన వార్తలు వినటం సాధారణం. దీంతో అనేక కుటుంబాలు దిక్కు లేని వారిగా మారుతున్నారని, అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారని పి.టి.ఎం. సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో పష్టున్ లు అంటే ఉగ్రవాదులు అనే మచ్చ పడుతోందన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంలో మొదటి నుంచి పంజాబ్ రాష్ట్రం వారిదే ఆధిపత్యం కావటం పష్టున్ లను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించటం గత డెబ్బై ఏళ్ళుగా సాగుతోంది.

ఇటీవల ఖైబర్ పఖ్తుంక్వ రాష్ట్రంలోని చర్సద్ద పట్టణంలో పష్టున్ తఃఫుజ్ మూవ్మెంట్ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో ఎక్కువమంది పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్ఘన్ ప్రజలకు అండగా ఉండాలని తీర్మానించారు. ఈ నినాదంతో పాక్ లోని అనేక నగరాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించగా ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. మతం పేరుతో మారణహోమం మంచిది కాదని, ఆఫ్ఘన్లో శాంతికి పాకిస్తాన్ పూనుకోవాలనే నినాదానికి మద్దతు పెరుగుతోంది. దోహలో తాలిబాన్ లతో అమెరికా ఒప్పందాన్ని కూడా వీరు విమర్శిస్తున్నారు. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెంటనే ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆయన సొంత రాష్ట్రం ఖైబర్ పఖ్తుంక్వ నుంచి డిమాండ్ పెరుగుతోంది. చైనా, పాకిస్తాన్ తెరచాటు రాజకీయాలు మానుకుంటే ఆఫ్ఘన్లో శాంతి నెలకొంటుందని పష్టున్ తఃఫుజ్ మూవ్మెంట్ పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రచారం చేపట్టింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్