పార్టీ నుంచి ఎన్నికైనవారు బాధ్యతతో మెలగాలని, దురుసుగా మాట్లాడ్డం, బెదిరింపు ధోరణితో వెళ్లడం సమంజసం కాదని ఏపీ డిప్యూటీ సిఎం, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ హితవు పలికారు. జనసేన తరఫున ఎన్నికైన శాసనసభ్యులు, లోక్ సభ సభ్యులు, శాసన మండలి సభ్యులను ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ సత్కరించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాజకీయాల్లో కక్ష సాధింపులకు దూరంగా ఉండాలని, వైసీపీ గానీ.. మరే పార్టీ గానీ మనకు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని… శత్రువులు కాదని వ్యాఖ్యానించారు. గతంలో వారు చేసిన తప్పులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని… అంతేగానీ వేధింపులు తగదని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో వారిని కించపరచవద్దని ఉద్భోదించారు.
అధికార దుర్వినియోగం తగదని, పార్టీ నేతలెవరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులను ప్రోత్సహించవద్దని సూచించారు. వారసత్వ రాజకీయాలకు మనం వ్యతిరేకం కాకపోయినా, జనం మీద రుద్దకూడదని అన్నారు. ఎవరైనా దురుసుగా వ్యవహరించినా… మహిళా నేతలను సామాజిక మాధ్యమాల్లో విమర్శించినా సీరియస్ యాక్షన్ ఉంటుందని…. ఎవరైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అలాంటి వారిని వదులుకునేందుకు వెనకాడబోనని తేల్చి చెప్పారు. ఏపీలో ప్రస్తుతం ఉన్నది తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వమని… మిగిలిన రెండు పార్టీల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం… విమర్శలకు దిగడం చేయవద్దని… ప్రభుత్వంపై నమ్మకం కలిగించాల్సిన సమయం ఇది అంటూ నేతలకు నిర్దేశించారు. ప్రతి రోజూ ఒక ప్రజా ప్రతినిధి అయినా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
నామినేటెడ్ పదవుల్లో పార్టీ నేతలకు న్యాయం జరిగేలా చూస్తామని… అలాగని అందరికీ ఛైర్మన్ పదవులే కావాలంటే కుదరదని.. టిటిడి ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికి 50 మంది నేతలు తనను అడిగారని వెల్లడించారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకోసం పని చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబుకు మనం అండగా ఉందామని అన్నారు.