తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య. ఇప్పుడు ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. కారణం ఏంటంటే.. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో రూపొందుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’ సినిమాలో టైటిల్ సాంగ్ పాడే అవకాశం అయన దక్కించుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ పాటను యూట్యూబ్‌లో విడుదల చేయగా 10 గంటల్లో 6 లక్షల మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ పాటలో ఏడు మెట్ల కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ ఓ వ్యక్తి కనిపిస్తాడు. అంతరించిపోతున్న కళకు ఊపిరిలూదుతున్న ఆ అరుదైన కళాకారుడే మొగులయ్య.
అయితే… ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కిన్నెర కళాకారులు దర్శనం మొగులయ్యకి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందచేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో రూ.2 లక్షల చెక్కును మొగులయ్య కు అందచేసి సత్కరించారు పవన్. తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డా.దాసరి రంగాకి రూ.50 వేలు చెక్కు ఇచ్చి సన్మానించారు. పవన్ కళ్యాణ్ తన ట్రస్ట్ ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ నుంచి ఈ ఆర్థిక సాయాన్ని అందించారు.