వేల కోట్ల రూపాయలతో ముడిపడిన రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీని నడపడం సాహసోపేతమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ శ్రేణులనుద్దేశించి పవన్ ప్రసంగించారు. కార్యకర్తలు, అభిమానుల అండదండలు, సహకారం, ఆదరణ వల్లే పార్టీని నడపగలుగుతున్నానని వెల్లడించారు. ఇదే అభిమానం కొనసాగిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుందని, ప్రజలకు మరింత సేవ చేద్దామని విజ్ఞప్తి చేశారు.
కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సమావేశంలో నివాళులర్పించారు. నంద్యాలలో మృతి చెందిన జనసేన కార్యకర్త ఆకుల సోమేష్ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్ ను అందించారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారని, కొంతమంది క్రియాశీల జన సైనికులను కూడా కోల్పోవడం వ్యక్తిగతంగా తనను ఎంతో బాధించిందన్నారు పవన్. కరోనా కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారని, ప్రాణాలను ఫణంగాపెట్టి జన సైనికులు ముందుకు వెళుతున్నారని కొనియాడారు. లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరపున భీమా సౌకర్యం కల్పించామని వెల్లడించారు. దీనికోసం తన వంతుగా కోటి రూపాయలు ఇచ్చానని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల శాఖ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.