పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రానికి ‘BRO’ టైటిల్ ఖరారు చేశారు. తన మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ మొదటిసారి స్క్రీన్ పంచుకుంటున్న చిత్రమిది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.

ఈ ‘బ్రో’ మూవీ మోషన్ పోస్టర్ అయితే కట్టిపడేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో పరమేశ్వరుడి రూపం కనిపిస్తుండగా.. “కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం.. బ్రో బ్రోదిన జన్మలేషం.. బ్రో బ్రోవగ ధర్మశేషం.. బ్రో బ్రోచిన కర్మహాసం.. బ్రో బ్రోదర చిద్విలాసం” అనే శ్లోకం వినిపిస్తుండగా.. మెడలో ఓం లాకెట్ ధరించి స్టైలిష్ గాడ్ లా కనిపిస్తున్న కథానాయకుడు పవన్ కళ్యాణ్ రూపాన్ని పరిచయం చేసిన తీరు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అలాగే ఈ చిత్రాన్ని 2023, జులై 28న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

‘బ్రో’ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం పట్ల సాయి ధరమ్ తేజ్ తన ఆనందాన్ని పంచుకున్నారు. నా గురువు అయిన పవన్ కళ్యాణ్ మామతో కలిసి పని చేయడం నా అతి పెద్ద కల అని, ఆ కల నెరవేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇంతటి అదృష్టం దక్కినందుకు ఓ అభిమానిగా మనసులోనే నాట్యం చేస్తున్నానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *