Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

పవన్ క‌ల్యాణ్’ఎపిక్ మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ఈ చిత్రం షూటింగ్ త్వరలో పునప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ తో చిత్ర సమర్పకులు ఎ.ఎం. ర‌త్నం, డైరెక్టర్ క్రిష్ ఈరోజు చర్చలు జరిపారు. ‘భీమ్లా నాయక్’  షూటింగ్ పూర్తవగానే ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ షూటింగ్ ప్రారంభించటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రీకరించ వలసిన సన్నివేశాలు, గీతాలు, పోరాట సన్నివేశాలు, షూటింగ్ ప్రదేశాలు, నిర్మించ వలసిన భారీ సెట్స్ వంటి విషయాల గురించి చిత్ర నిర్మాత, దర్శకుల మధ్య సమాలోచనలు జరిగాయి. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ దాదాపు యాభై శాతం పూర్త‌యింది.

మిగిలిన భాగాన్ని నిరవధికంగా షూటింగ్ జరిపి పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ‌ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు. “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” 2022 ఏప్రిల్ 29 న విడుదల అన్న విషయాన్ని కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని చిత్ర నిర్మాణ కార్యక్రమాలు త్వరిత గతిన జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌ కావడంతో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్ గా ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ను రూపొందిస్తున్నారు దర్శకుడు క్రిష్. పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరుపొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com