చంద్రబాబు చెప్పు చేతల్లో నడుస్తున్న పార్టీ జన సేన అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బాబు ఆదేశాల మేరకే కాపులు-రెడ్లకు మధ్య తగాదా పెట్టేందుకు పవన్ ప్రయత్నించారని ఆరోపించారు. ఒక స్ట్రాటజీ ప్రకారమే తనను లక్ష్యంగా ఎంచుకున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు కలత చెందిన ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు లేఖ రాశారని, తన కుటుంబంపై ఉన్న గౌరవాన్ని, కాపులకు తమ కుటుంబం అండగా ఉన్న విషయాన్ని తెలియజేసిన ముద్రగడకు తన కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు సాయంత్రంలోగా తనపై పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటన చేయకపోతే ఆయన తనపై చేసిన విమర్శలన్నీ తప్పు అని భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కాకినాడలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపి వంగా గీత లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
పవన్ యాత్ర సినిమాటిక్ గా జరుగుతోందని, కాకినాడ జిల్లా అభివృద్ధికి ఏవైనా సలహాలు ఇస్తారని చూశామని కానీ అలాంటిది ఏమీ లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సిఎం అభ్యర్ధిని అని చెప్పుకున్న వ్యక్తి ఇలా మాట్లాడిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవని, పవన్ ఎక్కువగా అభిమానించే చంద్రబాబు కూడా ఎప్పుడూ ఇలా మాట్లాడలేదన్నారు. పవన్ ఎక్కడకు వెళ్తే అక్కడ స్థానిక వైసీపీ నేతలపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. తాము ప్రజాప్రతినిధులుగా ఎన్నికై నిరంతరం ప్రజా సేవలో ఉంటే ఎప్పుడో ఓసారి టూర్ కు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం చూస్తే ఆయన ఆరోపణలకు స్పందించాల్సి అవసరం ఉందా అని అనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ద్వారంపూడి ఏదైనా తప్పు చేసి ఉంటే ఆధారాలతో బైట పెట్టాలని, అంతేకానీ వ్యక్తిగత దూషణలతో, వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదన్నారు. సిఎం అయ్యే స్తోమత తనకు లేదని మూడు నెలల క్రితం చెప్పిన పవన్ ఇప్పుడు సిఎం చేయమని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. వివరాలు తెలుసుకోకుండా ఎవరో ఏదో చెబితే విమర్శలు చేయడం పవన్ మానుకోవాలన్నారు.
పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాకినాడ ఎంపి వంగా గీత సూచించారు. ఒక రాజకీయ పార్టీని నడిపే విధానం తెలియకుండా పరుష పదజాలంతో మాట్లాడడం సరికాదన్నారు. నాయకులంటే నమ్మకం, రాజకీయాలంటే గౌరవం పోతున్న ఈ రోజుల్లో పరిపాలనా వ్యవస్థను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు చేరువ చేసిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు.