Welfare-Debts: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం అనేది ఓ బూటకమని, సంక్షేమం ముగుసులో ఆర్ధిక అరాచకానికి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఘాటుగా విమర్శించారు. వివిధ పథకాలకు, ప్రాజెక్టులకు అంచనాలు నాలుగు రెట్లు పెరిగి పోతున్నాయని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాలో జిల్లెడుబండ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వ హయాంలో 90 కోట్ల రూపాయలకు అంచనాలు వేశామని, అదే రిజర్వాయర్ కు, అదే నీటి సామర్ధ్యంతో అంచనాలు 300 కోట్ల రూపాయలకు వేశారని వివరించారు. సంక్షేమం కోసం అప్పులా, స్వార్ధం కోసం అప్పులా అని కేశవ్ ప్రశ్నించారు. అప్పులు పెరిగిపోయినా సామాన్యుడికి ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రాన్ని అంధకారంవైపు తీసుకు వెళుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనకపోతే శ్రీలంక కంటే నాలుగు రెట్లు సంక్షోభంలో ఆంధ్ర ప్రదేశ్ కూరుకుపోతుందని పయ్యావుల ఆందోళన వ్యక్తం చేశారు.
సంక్షేమానికి తాము వ్యతిరేకం కాదని, సామాన్యుడిని ఆదుకోవడం తమ పార్టీ విధానమని, అసలు సంక్షేమం కోసం రూపకల్పన చేసిందే ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. కానీ సంక్షేమం పేరుతో అప్పులు తీసుకున్నారు గానీ ఏదైనా ఉపయోగపడే పనులు చేశారా, కనీసం ట్యాంకులు కడగగలిగారా అని నిలదీశారు. రాబోయే రోజులో ఇరిగేషన్ లో 15వేల కోట్ల రూపాయలు, విద్యుత్ లో 6వేల కోట్ల రూపాయలు అంచనాలు పెంచేందుకు సిద్ధపడుతున్నారని వెల్అలడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ కాగ్ కు ఎందుకు లెక్కలు చూపలేక పోతోందని కేశవ్ అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఇవ్వకపోతే ప్రిన్సిపాల్ ఆడిట్ జనరల్ గట్టిగా అడగాలని కేశవ్ సూచించారు. ప్పుల ఇండెక్స్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో అన్ని విభాగాల్లో ఏపీ మొదటి రెండు మూడు స్థానాల్లోనే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకు వెళుతున్నారని కేశవ్ వ్యాఖ్యానించారు.
Also Read : కొత్తగా ఏం తేల్చారు? పెగాసస్ పై కేశవ్ ప్రశ్న