Confidence; కుప్పం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే ఎన్నికలల్లో ఎమ్మెల్సీ భరత్ పోటీలో ఉంటారని, ఆయనే కచ్చితంగా శాసనసభ్యుడిగా ఎన్నికవుతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తమిళ హీరో విశాల్ ను కుప్పం నుంచి పోటీకి దించుతున్నట్లు నేడు ఓ దినపత్రికలో వచ్చిన వార్తను అయన తోసిపుచ్చారు. వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా స్థాయి ప్లీనరీ నేడు పలమనేరులో జరిగింది, ఈ సమావేశంలో దీనిపై పెద్దిరెడ్డి స్పష్టత ఇచ్చారు.
భరత్ నాయకత్వంలోనే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయదుందుభి మోగించిందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై భరత్ పోటీ చేసి విజయం సాధిస్తారని అయన ధీమా వ్యక్తం చేశారు. భరత్ పోటీ విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వొద్దని ఊహాగానాలను, పుకార్లను నమ్మొద్దని చెప్పారు.
హీరో విశాల్ కుటుంబం మూలాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి, అందులోనూ పలుసారు విశాల్ సిఎం జగన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. దీనితో ఈసారి కుప్పం నుంచి విశాల్ ను బరిలోకి దించేందుకు జగన్ నిర్ణయించారని, రేపో మాపో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వచాయి. పెద్దిరెడ్డి నేడు చేసిన ప్రకటనతో గత నాలుగైదు రోజులుగా ప్రచార, ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నన్నీ పుకార్లేనని తేలిపోయింది.