Wednesday, March 18, 2026
HomeTrending Newsవనరుల వినియోగంతో ఆదాయం: పెద్దిరెడ్డి

వనరుల వినియోగంతో ఆదాయం: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని రాష్ట్ర భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అపారమైన ఖనిజ సంపద ఉన్న నేపథ్యంలో వాటిని వినియోగించుకోవడం ద్వారా అటు పారిశ్రామిక ప్రగతికి, ఇటు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. సిలికాశాండ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని అన్నారు.

గనుల శాఖలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా సీఎం జగన్ ఆదేశాల మేరకు పారదర్శక విధానాలను తీసుకువచ్చామని అన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు, ఈ-పర్మిట్ విధానం ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా అనుమతులు మంజూరు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం గనుల లీజుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గత ఏడాది కంటే ఈ ఏడాది ఆదాయం పెరుగుతుందని, ఈ మేరకు అధికారులు కూడా బాద్యతతో వ్యవహరించాలని కోరారు. ఎపిఎండిసి ద్వారా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టులను ప్రారంభించామని, వాటి ద్వారా కూడా అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని ఈ సందర్బంగా అధికారులు వివరించారు. సిలికాశాండ్, కాల్సైట్, ఐరన్ ఓర్, గ్రానైట్ ఖనిజాలను వెలికితీయడం ద్వారా ఖనిజాధారిత రెవెన్యూ వనరులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.

ఈ సమావేశంలో గనులు, భూగర్భ గనులు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది,  డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ఎపిఎండిసి విసి అండ్ ఎండి విజి వెంకటరెడ్డి, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఎపిఎండిసి జిఎం (మైన్స్) కేదార్‌నాథ్ రెడ్డి, జిఎం (కోల్) లక్ష్మణరావు, డిజిఎం నతానేయల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular