People are Happy: ప్రాణాలు పోయినా, ఆస్తులు పోయినా ఎన్నడూ అబద్దం చెప్పని వ్యక్తిని సత్య హరిశ్చంద్రుని రూపంలో ఇతిహాసాల్లో, పురాణాల్లో చూశామని… కానీ జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పని వ్యక్తి పురాణాల్లో కాకపోయినా నేటి రాజకీయాల్లో చూస్తున్నామని….ఆయనే చంద్రబాబు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బాబు తన మేనిఫెస్టోలో చెప్పింది ఎప్పుడూ ఏమీ చేయలేరని, అందరినీ కలుపుకొని గెలవడమే ఆయనకు తెలుసన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మూడేళ్ళపాటు తాము ఏయే పథకాలు అందించామో స్పష్టంగా ప్రజలకు చెబుతున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రతి ఇంటికి వెళ్లి ధైర్యంగా ఇవ్వగలుగుతున్నామన్నారు. కానీ గత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను దాచి పెట్టిందని గుర్తు చేశారు.
ఇటీవల తాను ఓ గ్రామానికి వెళ్ళినపుడు అక్కడ కేవలం ముగ్గురు మాత్రమే తమ పథకాలు అందని వారున్నారని, వారికి ఎందుకు రాలేదో ఆరా తీస్తే వారు ట్యాక్స్ పేయర్స్ అని తేలిందని రాంబాబు తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి అమలు చేసిన పథకాల పేర్లు చెప్పి వారి మద్దతు అడుగుతున్నామని, ఇలాంటి ధైర్యం టిడిపి గతంలో ఎన్నడైనా చేసిందా అని నిలదీశారు. తాము కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇంటికే వెళ్ళడంలేదని…. టిడిపి, జనసేన, బిజెపి, వామపక్షాల వారి ఇళ్ళకు కూడా వెళ్లి వారికి అందుతున్న సంక్షేమం గురించి వివరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం మొత్తంలో కేవలం ఒకట్రెండు చోట్ల టిడిపి కార్యకర్తలు ఏదో గొడవ చేస్తే దాన్ని బ్రేకింగ్ వేసి చూపుతున్నారని.. వాస్తవం అది కాదని, సంక్షేమం, పాలన పట్ల ప్రజలు అద్భుతమైన ఆనందంతో ఉన్నారని గడప గడపకు వెళితే తెలుస్తుందన్నారు. ఈ రాష్ట్రానికి తిరిగి జగన్ సిఎంగా కావాలని ప్రజలంతా కోరుతున్తున్నారని అంబటి చెప్పారు.
Also Read : ఏం చేశామో చెప్పే ధైర్యం మాకుంది: శ్రీకాంత్ రెడ్డి