Telangana Unlock :
హమ్మయ్య …తెలంగాణ అన్ లాక్ అయింది .. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చేసింది. ఇప్పటిదాకా స్వేచ్ఛ లేదా.. అదేనండి సగం స్వేచ్ఛ తో ఇబ్బంది పడ్డారు కదా .. ఇకనుంచి ఆ భయం కూడా లేదు. రోడ్డు మీద ఆపే నాధుడే లేడు. లాఠీ దెబ్బల ఊసే వుండదు. ఎక్కడికైనా ఏ టైం అయినా రావచ్చు పోవచ్చు. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు లాక్ డౌన్ లేదు గీక్ డౌన్ లేదు అంటూ ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పేసింది. ఇది చావు కబురు కాదు తీపి కబురు అంటే చేసేదేమీ లేదు గాని, కరోనా నియంత్రణ పూర్తి స్థాయిలో జరిగిందని ఆరోగ్య శాఖ నివేదిక ఇవ్వడమే కొంత ఎబ్బెట్టుగా వుంది. స్వీయ నియంత్రణ ముఖ్యమని ఇక ఎన్నాళ్లు ప్రభుత్వం ప్రజలను కట్టడి చేస్తూ కూచుంటుందని ఒక ఉచిత సలహా ఇచ్చేశారుగానీ, అదే ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తుంది అన్నది కూడా కొందరి ప్రశ్న, అదే అందరి ప్రశ్న కూడా…….
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతి తగ్గింది… ఆమాటకొస్తే పక్క రాష్ట్రాలు, అదే దేశవ్యాప్తంగాను కోవిడ్ యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అంటే దేశం నుంచి కరోనా మహమ్మారి పారిపోతోందా ? అదేం లేదు. కరోనా అన్ని చోట్ల కాచుకుని కూర్చోనే వుంది. ఎక్కడ గుర్తుపడతారో అన్నట్లు రంగులు (వివిధ వేరియంట్ల రూపంలో)మారుస్తూ ఎప్పుడు బయటకు వచ్చి తనకు దొరుకుతారా అంటూ ఎదురు చూస్తూనే ఉంది. లాక్ డౌన్ పుణ్యమా అంటూ కొంతలో కొంతైనా జనం తలపులు ఎట్లావున్నా,తలుపులు మూసుకొని ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా కట్టడిలో భాగమయ్యారు.ఉపాధి కరువైనా, బతుకు భారమైనా బతికుంటే బలుసాకు తినవొచ్చన్న రీతిలో ప్రభుత్వ లాక్ డౌన్ నిర్ణయానికి లోబడి నడుచుకున్నారు. మంచి ఫలితమే కనిపించింది.
మరి తెలంగాణ లో అసలు కరోనా లేకుండా పోతుందా…. ఇక తాళం తీసేసి, అన్ లాక్ అంటూ తలుపులు బార్లా తెరిచి వుంచితే కరోనా ముప్పును ఎలా ఎదుర్కోంటాం… ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నారా…ఇకనైనా పాటిస్తారా… ఆంటే జవాబు దొరకదు.అలాఅని ప్రభుత్వాలు కూడా ఎన్ని రోజులు,నెలలు లాక్ డౌన్ విధిస్తూ పోతాయి ? ప్రజల బతుకులను భారం చేస్తూ, ఆర్ధికంగా కుంగిపోతూ ఎంతకాలం ఈడ్చుకు వస్తారన్న ప్రశ్నలు వేసే వారు ఉన్నారు. మరి మార్గం ఏంటి? ప్రజలే వొళ్లు దగ్గర పెట్టుకోవాలి. విందులు వినోదాలు మరచి మసులుకోవాలి.
People Must Be More Cautious Of Corona In View Of The Telananga Unlock :
కరోనా వచ్చిన మొదట్లో అసలది ఎలా వ్యాప్తి చెందుతుందో తెలవదు. ప్రజలకు అవగాహన లేదు .ఆ మాటకొస్తే ప్రభుత్వాలకు ఏమీ తెలియని పరిస్థితి.సంపూర్ణ లాక్ డౌన్ తో ఇతర ఆంక్షలు,తగిన చర్యలతో విజయం సాధించామన్న ధీమాతో పొంగిపోయాం. లాక్ డౌన్లు పోయి… సంపూర్ణ అన్ లాక్ అవ్వగానే మన సోయి తప్పి కరోనా దాక్కొనేవున్నదన్న విషయాన్ని కూడా మరచి పోయాం. అంతే దూసుకొచ్చిన సెకండ్ వేవ్ తో అల్లాడి పోయాం.. ఫలితం ఊహించని రీతిలో అనుభవించాం….
మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి.. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గింది.అంతేగాని కరోనా ముప్పు పోలేదు. మూడో వేవ్ కూడా ముంచుకొస్తోంది.ఈ సమయంలో తెలంగాణ సర్కారు సంపూర్ణ అన్ లాక్ నిర్ణయం తీసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకాలం లాక్ డౌన్ అమలులో ఉన్నా, సడలింపు పేరిట ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ ఎలానూ ఏ ఆంక్షలూ లేవు. ప్రజలు కూడా ఆ సమయానికి అలవాటుపడ్డారు. ఇంకొంతకాలం ఇదే పరిస్థితి సాగినా ఫరవాలేదని భావిస్తున్నారు.ప్రభుత్వం
మరికొంత సడలింపు ఇచ్చినా రాత్రి పూట కర్ఫ్యూ మాత్రం ఇంకొంత కాలమైనా కొనసాగుతుందన్న నిశ్చయానికి వచ్చారు.అయితే అందరి ఆలోచనలకు భిన్నంగా ప్రభుత్వం సంపూర్ణ అన్ లాక్ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక కరోనా భారం అంతా ప్రజలపైనే వేసింది. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆర్డర్ వేసింది. ముక్కుకు మూతికి మాస్క్ వేసుకోకుండా బయటికి వస్తే 1000 రూపాయలు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. దుకాణాలు మాల్స్ తో పాటు అన్ని చోట్ల కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేయాలంటూ షరతులు పెట్టింది.
జూలై 1 నుంచి పాఠశాలలను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా మూడో ముచ్చట పిల్లలను కూడా ముప్పుతిప్పలు పెడుతుందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఏ ధైర్యంతో విద్యాసంస్థలను తెరవాలని చూస్తోందోగాని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతమేరకు స్కూల్స్ కు పంపుతారు అన్నది మాత్రం అనుమానమే.
ఏదైనా ఇప్పుడు కరోనా కాటుకు బలికాకుండా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిందే. అంతకుమించి బాధ్యతగా వ్యవహరించాల్సిందే. ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది కదా అని గుంపులు గుంపులుగా చేరితే మాత్రం కరోనా మూడో ముప్పు తప్పదు . అసలే ఈ అంటుకునే రోగంతో ఏ కొందరు బాధ్యత తప్పినా అందరూ బాధపడాల్సిందే. అందుకే అందరం కళ్లు తెరుద్దాం. కరోనా తన మూడో కన్ను తెరవకుండా జాగ్రత్తపడదాం….. బాధ్యతగా వ్యవహరిద్దాం…..మనల్ని మనమే కాపాడుకుందాం. అందుకే పారాహుషార్ ….లేదంటే కరోనాదే హుషార్. జర జాగ్రత్త మరి.
-వెలది కృష్ణకుమార్
Must Read : కరోనాలో ‘LAMBDA’ అనే కొత్త వేరియంట్