Saturday, January 18, 2025
HomeTrending Newsజగన్ కు ఎందుకు భయపడాలి?: పవన్

జగన్ కు ఎందుకు భయపడాలి?: పవన్

ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగితే చలించిపోయి జగన్ కు అధికారం అప్పగించారని కానీ ఐదేళ్లుగా జగన్ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.  రోడ్లపై గోతులు-నోరు తెరిస్తే బూతులు…ఇంకా ఎక్కువగా ఎవరైనా మాట్లాడితే కేసులు అంటూ ధ్వజమెత్తారు. గుడివాడలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో  ఆయన ప్రసంగించారు. ప్రజల్లో ధైర్యం నింపడానికే తాను ముందుకు వచ్చానన్నారు. మాటకు విలువ ఉంటుందని… ఒక్కసారి మాట ఇస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదని… వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని 2021లో చెప్పానని.. దాని ప్రకారం అందరినీ ఒప్పించాలని బిజెపి పెద్దలతో కూడా దీనిపై మాట్లాడానని, అందరం కలిసి కూటమిగా ప్రజల ముందుకు వచ్చామని వివరించారు.

ఎవరైనా జగన్ కు ఎందుకు భయపడాలని, ఎవరి పనులు వారు చేసుకుంటున్నారని… అలాంటి చిరంజీవి, ప్రభాస్, మహేష్ లు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. సినిమాలు ఉంటాయి- పోతాయి; డబ్బులు వస్తాయి-పోతాయి కానీ మనం స్వేఛ్చను పోగొట్టుకోగూడదని అది పోయిన రోజు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నా అది నిష్ప్రయోజనమని వ్యాఖ్యానించారు.  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గ్రాబ్ యాక్ట్ గా మారిందని… వైసీపీకి ఎవరైనా ఓటేస్తే ఎవరికి వారు తమ ఆస్తులపై హక్కులు వదులుకున్నట్లు అంటూ ప్రజలను హెచ్చరించారు.

ప్రజల సమస్యలపై అసెంబ్లీలో పోరాడేవారు, ప్రజల కోసం నిలబడేవారు, చొక్కా పట్టుకుని నిలదీసేవారు కావాలని.. అలాంటి సమూహంగా తాము వచ్చామని వివరించారు. మే 13 జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ఓటు వేసి కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్