Monday, May 20, 2024
HomeTrending Newsల్యాండ్ టైటిలింగ్ ఓ నల్ల చట్టం: చంద్రబాబు

ల్యాండ్ టైటిలింగ్ ఓ నల్ల చట్టం: చంద్రబాబు

అధికారంలోకి రాగానే ఇసుక మాఫియాను తుంగలో తొక్కి ఉచితంగా ఇసుక అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మద్యం ధరలను నియంత్రిస్తామన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బాబు పాల్గొన్నారు. రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకని, ఉంటే భూముల యజమాని ఫొటో ఉండాలని, జగన్ ఫొటో పెట్టిన పుస్తకాలు చిత్తు కాగితాలతో సమానం అంటూ ఓ పాస్ పుస్తకాన్ని చించి వేశారు చంద్రబాబు.

కొత్తగా వచ్చిన లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములు జగన్ తన గుప్పెట్లో పెట్టుకుంటున్నారని.. మన భూములపై ఆయన పెత్తనం ఏమిటని నిలదీశారు. 2023 అక్టోబర్ నుంచే ఈ యాక్ట్ అమల్లోకి తెచ్చారని, అమెరికా కాలిఫోర్నియాలోని తన బినామీ అయిన క్రిటికల్ రివర్ అనే కంపెనీ చేతిలో మన భూముల వివరాలన్నీ పెడుతున్నారని ఆరోపించారు.  నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వద్ద మన రికార్డులు ఉండాలని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ నల్ల చట్టమని, మీ భూమి మీదికాదని… ఈ భూమి జగన్ ది అవుతుందని హెచ్చరించారు. తాము రాగానే ఈ చట్టాన్ని రద్దుచేస్తామని ప్రకటించారు.  శవరాజకీయాలు చేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు.

ప్రజల కోసం ఓ బ్రహ్మాండమైన మేనిఫెస్టోను ఇచ్చామని… ‘జగన్ తెచ్చిన మేనిఫెస్టో వెలవెల తమది గలగల’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఏం చేశారో, ఏం చేస్తారో జగన్ చెప్పలేకపోతున్నారని విమర్శించారు. గత నెలలో పెన్షన్ పేరిట పేదలను ఇబ్బందులు పెట్టారని, ఈసారి కూడా ఇంటివద్ద పంపిణీ చేయకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని, గత నెలలో 33 మంది ప్రాణాలు బలి తీసుకున్నారని, ఈ నెలలో ఇప్పటికి ఏడుగురు చనిపోయారని దీనికి జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్ కంటే 25 శాతం ఎక్కువ సంక్షేమం ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, జగన్ క్లాస్ వార్ అంటున్నారని కానీ ఇది క్యాష్ వార్ అని దుయ్యబట్టారు.

దొనకొండను పారిశ్రామికకేంద్రంగా తీర్చిదిద్ది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, గంజాయి వద్దు-జాబులు ముద్దు అనేది తమ నినాదమని స్పష్టం చేశారు. దర్శికి సాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్