తెలుగుదేశం పార్టీ మాయమటలు, అబద్ధాలు, మోసపూరిత హామీలు నమ్మవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రతి ఇంటికీ కిలో బంగారం, ఓ బెంజ్ కారు ఇస్తామని కూడా వారు చెబుతారని, అలాంటి ప్రలోభాలకు లోనుకావద్దని కోరారు. పుట్టపర్తిలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజన ఐదో ఏడాది రెండో విడత నిధులను సిఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగిస్తూ తాను దేవుడిని, తమ ప్రభుత్వం మేలు చేసిన ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని స్పష్టం చేశారు. ప్రజలకు తనకు మధ్యలో మరొకరు అవసరం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అధికారం కావాల్సింది ప్రజలకు, రైతులకు, మహిళలకు మంచి చేయడానికి కాదని; తన వారికి మంచి చేయడానికే ఆయన అధికారం వాడుకుంటారని సిఎం విమర్శించారు.
బాబు ఇన్నేళ్ళు పరిపాలన చేసినా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకం కూడా లేదని ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్ళుగా మంచి వర్షాలు కురిశాయని, ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం లేకపోయిందని… ఈ ఏడు కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం వల్ల కరువు వచ్చిందని, ఆ ప్రాంతాల ప్రజలను, రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కరువు రావడం-రాకపోవడం మన చేతుల్లోని అంశం కాదని కానీ కరువు వచ్చినప్పుడు ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని, తమలాంటి మనసున్న ప్రభుత్వమే ఆదుకుంటుందని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు మంచి చేసిన ప్రభుత్వం తమదేనని, అందుకే వారు తమను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తమ పార్టీ సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని అన్నారు. తండోప తండాలుగా జనం తరలి వస్తున్నారని అన్నారు.