అమరావతి పరిరక్షణ సమితి పేరుతో మళ్ళీ పాదయాత్ర అంటూ డ్రామాలు మొదలుపెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. పాదయాత్రకు కలెక్షన్ ఫుల్- ఆదరణ నిల్ అని అభివర్ణించారు. ఉద్యమం పేరుతో వసూళ్ళ రాజకీయం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు అభివృద్ధి చేయకూడదా అని అడిగారు. రాష్ట్రాన్ని చంద్రబాబు సంక్షోభం ఊబిలోకి నెట్టారని, పేదలకు సంక్షేమం చేస్తుంటే చూసి ఓర్వలేక పోతున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
సాధారణంగా రాజధాని అంటే రాష్ట్రంలోని ప్రజలందరూ తమది అనుకుంటారని, కానీ చంద్రబాబు, రెండు మీడియా సంస్థలు మాత్రం రాజధాని అంటే తమకు సంబంధించినదే అనే ఆలోచనలో ఉన్నారని పేర్ని విమర్శించారు. దుష్టచతుష్టయం క్లబ్ లో ఒకరు పెన్నులో సిరా బదులు విషం కక్కారని దుయ్యబట్టారు. అమరావతి చట్టానికి తూట్లు పొడిచారంటూ రాశారన్నారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో ఎవరికీ భూములు ఇవ్వలేదా అని నాని ప్రశ్నించారు. బిసి,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇక్కడ ఇళ్లస్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని గతంలోనే కోర్టులో అఫిడవిట్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు.
సిఎం జగన్ పై విషం చిమ్మడానికే వారు మీడియాను ఉపయోగించుకుంటున్నారని, చంద్రబాబు ఏమి చేసినా కరెక్టు, జగన్ ఏమి చేసినా తప్పు అనే విధంగా రాతలు ఉన్నాయని పేర్కొన్నారు. హైకోర్టు నిలిపి వేసినా చట్టంలోనే మార్పులు చేస్తూ పంతం నెగ్గించుకుంటున్నారని, చంద్రబాబు ఏం చేసినా సమ్మగా ఉంటుందా అంటూ మండిపడ్డారు. రాజధానిలో పేదలకు ఇళ్లు ఇవ్వ వద్దా, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే జరగాలా అని నిలదీశారు.
Also Read : త్వరలో బాబు గిన్నీస్ రికార్డు : పేర్ని