Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Robo Raman:
“రథగజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే…” అని అమ్మవారిని పూజిస్తాం. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాల కాన్వాయ్ తో శోభిల్లుతున్న అమ్మకు నమస్కారం అంటున్నాం.

“గజాన్ ఆరోహయామి ” అని షోడశోపచార పూజావిధానంలో ఇంటికొచ్చిన దేవుడిని ఏనుగు మీద ఎక్కించి పూజిస్తున్నాం.

పార్వతి సున్నిపిండిని నలిచి సుతుడిగా మలిస్తే శివుడు ఏదో కారణానికి మెడ విరిచేశాడు. దాంతో పార్వతి అలిగితే అర్జంటుగా ఏనుగు ముఖాన్ని అతికించి ఆ పిల్లాడికి తిరిగీ ప్రాణం పోశాడు శివుడు. ఆ గజాననుడే లేకపోతే మన విఘ్నాలను అడ్డుకోవడానికి ఏ దేవుడూ దిక్కయి ఉండేవారు కాదు.

లక్ష్మీ దేవి శాశ్వత నివాసాల్లో ఏనుగు ముఖం ఒకటి.

మన పోతన గజేంద్ర మోక్షణంతో ఏనుగుకు శాశ్వత విష్ణులోక నివాస యోగ్యతతో పాటు గొప్ప సెలెబ్రిటీ హోదా దక్కింది.

పోతన పోతపోసిన పది లక్షల కోట్ల ఏనుగులకు అధిపతి అయిన ఏనుగు తొండంతో నీళ్లు పీల్చి పైకి చిమ్మితే…చేపలు మీనరాశి మీద పడ్డాయి. మొసళ్ళు మకర రాశిలో పడ్డాయి. ఎండ్రకాయలు కర్కాటక రాశిలో పడ్డాయి. ఆ ఏనుగు అడవిలో కాలు కదిపితే సింహాలకు సింహ స్వప్నమై గుహల్లో దాక్కున్నాయి. పులులు పొదరిళ్లలో బిక్కు బిక్కుమంటూ తలవంచుకున్నాయి. ఆ ఏనుగు తొండంతో ఒక్కటిస్తే కొండలు పిండి అయి నామరూపాల్లేకుండా పోయాయి.

అంతటి భీకరమయిన గజేంద్రుడు చివరికి మడుగు అడుగున దాగిన చిన్న మొసలి నోటికి చిక్కి వెయ్యేళ్లు ఏడుస్తూ కుర్చున్నాడనుకోండి…అది వేరే విషయం. మనమయినా అంతే…ఎగెరెగిరి పడితే…కన్ను మిన్ను కానక అందరినీ తొక్కుకుంటూ వెళితే…ఎక్కడో ఒక మొసలి నోటికి చిక్కుకుంటాం అన్నదే గజేంద్ర మోక్షణం ద్వారా గ్రహించాల్సింది.

గజాసురుడి పొట్ట చీల్చి రక్తమోడే ఏనుగు చర్మాన్ని చెర్మాస్ ప్యాంటులా శివుడు ఒక ప్రత్యేక సందర్భంలో కట్టుకోవాల్సి వచ్చింది. ఆ క్షణం నుండి “గజ చర్మాంబర ధారి” అన్న బిరుదుతో ఆయన్ను పొగుడుతూ ఉన్నాం.

సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ
రా పురవీధుల గ్రాలగలదె
మణిమయంబగు భూషణ జాలములనొప్పి
ఒడ్డోలగంబున నుండగలదె
అతి మనోహరలగు చతురాంగనల తోడి
సంగతి వేడ్కలు సలుపగలదె
కర్పూర చందన కస్తూరి కాదుల
నింపు సొంపార భోగింపగలదె

గీ. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి
సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె  జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము

 

ఆంధ్ర మహాభారతంలో ఆణిముత్యంలాంటి పద్యమిది. తిక్కన తెలుగు సోయగానికి చక్కని చిక్కని ఉదాహరణ ఇది. ఉత్తర గోగ్రహణ వేళ ఉత్తర కుమారుడు రథం తోలుతుండగా బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు దుర్యోధనుడి మొహం మీద అన్న మాట ఇది. ఘంటసాల పాడగా ఎన్ టి ఆర్ అభినయించి ప్రాణం పోసిన నాటకీయ సన్నివేశమిది. ఇరుపక్కలా ఏనుగులు వస్తుండగా…ఏనుగు మీద ఊరేగడం కాదు…నాతో యుద్ధంలో ఓడిపోయిన ఓ కౌరవేంద్రా! బుద్ధిగా ఇంటికెళ్లి పడుకో! అని గాలి తీసి పారేసిన సందర్భమిది.

“ఎదురైనచో దన మదకరీంద్రము డిగ్గి
కే లూత యొసగి యెక్కించుకొనియె
మనుచరిత్రం బందుకొనువేళ బుర మేగ
బల్లకి తనకేల బట్టియెత్తె
బిరుదైన కవిగండ పెండేరమున కీవె
తగు దని తానె పాదమున దొడిగె
గోకటగ్రామా ద్యనే కాగ్రహారము
లడిగినసీమలయందు నిచ్చె

నాంధ్రకవితాపితామహ యల్లసాని
పెద్దనకవీంద్ర యని నన్ను బిలుచునట్టి
కృష్ణరాయలతో దివి కేగలేక
బ్రతికియుండితి జీవచ్ఛవంబ నగుచు”

విజయనగర వీధుల్లో ఎదురుపడితే శ్రీకృష్ణదేవరాయలు తను సర్వంసహా చక్రవర్తిగా తిరిగే అంబారీ ఏనుగు దిగి అల్లసాని పెద్దనను పైకి ఎక్కించుకున్నాడట. అలాంటి గొప్పవాడు పోయాక…అతడితో పాటు పైకి పోలేక…ఇలా బతుకీడుస్తున్నాను అని పెద్దన కుమిలి కుమిలి ఏడ్చాడు.

ఏనుగు చచ్చినా…బతికినా ఒకటే. వీధిలో ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. పట్టించుకోవాల్సిన పనిలేదు.

అంతటి ఏనుగుల దంతాలు పీకి అమ్ముకోగల వీరప్పన్ లు అప్పుడప్పుడూ పుడుతూ ఉంటారు.

సింహం కలలోకి వస్తే గుండె ఆగుతుందన్న భయంతో మనం అనాదిగా ఏనుగును నిద్రపోనివ్వడం లేదు. అది మన కలో! ఏనుగు కలో! తేల్చాల్సింది అటవీ శాఖవారే!

ఇదివరకు గుళ్ల ముందు ఏనుగులు ఉండేవి. తరువాత ఏనుగు బొమ్మలు ఉండేవి. ఇప్పుడు ఏనుగు మర బొమ్మలు వస్తున్నాయి. కేరళలో ఒక వన్యప్రాణి సంరక్షణ సంస్థ లక్షలు ఖర్చు పెట్టి కృష్ణుడి ఆలయానికి పెద్ద ఏనుగు మర బొమ్మను బహుమతిగా ఇచ్చింది. మంచి ఆలోచనే.

అసలు ఏనుగులను గొలుసులతో బంధించి, అంకుశంతో పొడుస్తూ భక్తులను ఆశీర్వదించమని అడుగుతుంటే ఒళ్లు మండి అవి తొండంతో భక్తుల తాట తీసిన సందర్భాలు అనేకం.

ఇలాంటి మర బొమ్మలతో స్వామి కార్యం, స్వ కార్యం- రెండూ నెరవేరతాయి. నిగ్రహానికి విగ్రహమే పెద్ద అనుగ్రహం అనుకుంటే సరి!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

పులి చెప్పిన పులిహోర పురాణం

Also Read :

ఆధునిక గజేంద్ర మోక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com