టిడిపి-జనసేన అభ్యర్ధుల ప్రకటన తరువాత పవన్ కళ్యాణ్ దయనీయ పరిస్థితి మరోసారి వెల్లడైందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పడేసే వాటితో పవన్ సంతృప్తి చెందుతున్నారని, ఆయన్ను చూస్తే జాలి కలుగుతోందని…. పవన్ కంటే ఆయనను నమ్ముకొన్న అభిమానులు, కార్యకర్తలను చూస్తే మరింత జాలి కలుగుతోందన్నారు. ఆ పార్టీ ఎప్పటికీ టిడిపికి బి టీమ్ గానే వ్యవహరిస్తోందన్నారు. వారికి ఇచ్చిన సీట్లలో కూడా టిడిపికి చెందినవారే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
తక్కువ సీట్లకు పరిమితమైన జనసేన విన్నింగ్ శాతం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పనంగా వచ్చిన జనసేనను మింగేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాజకీయపార్టీ నడిపే సత్తా, లక్షణాలు పవన్ లో లేవని, త్వరలో బిజెపి ఈ కూటమిలో చేరితే వారికి ఇచ్చే సీట్లు కూడా జనసేన ఖాతానుంచే ఇచ్చే పరిస్థితి ఉందన్నారు.
పవన్ పై ఇన్నాళ్ళూ నమ్మకం పెట్టుకొని కలలు కంటున్నవారు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని సజ్జల సూచించారు. 24 సీట్లు ఇవ్వడం మాట పక్కన పెట్టి కనీసం ఆ సీట్లలో అభ్యర్ధులను నిర్ణయించే స్వేఛ్చ కూడా పవన్ కు లేని పరిస్థితి ఉందన్నారు. తాను ఎక్కడినుంచి పోటీ చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో ఆయన ఉన్నారని పేర్కొన్నారు. ఈమాత్రం దానికి పవన్ సొంత పార్టీ పెట్టడం ఎందుకని టిడిపిలో చేరి ఉపాధ్యక్షుడిగానో, కార్యదర్శిగానో ఉంటే సరిపోతుందని సలహా ఇచ్చారు.
టిడిపి-జనసేన పార్టీల ఎత్తుగడలు ఏమాత్రం చెల్లవని, వైసీపీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలవీ దింపుడు కళ్ళెం ఆశలేనని పేర్కొన్నారు.
వారు ప్రకటించిన జాబితాకు విలువ లేనప్పుడు దానిలో మళ్ళీ సామాజిక న్యాయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని సజ్జల స్పష్టం చేశారు.