నాకు హిందీ రాదు- కానీ పీయూష్ పాండే హిందీ ప్రకటనలన్నీ తెలుగులాగే చక్కగా అర్థమయ్యాయి. నాకు ఇంగ్లిష్ రాదు- కానీ పీయూష్ పాండే ఇంగ్లిష్ ప్రకటనలన్నీ తెలుగులా మనసు దోచుకున్నాయి. భారత దేశానికంతటికీ ఒక ఆత్మ, ఒక భాషాతీత భాష ఉందని కనుగొన్నవాడు; ఆ భాషకు కొన్ని సాంస్కృతిక మూలాలుంటాయని పసిగట్టినవాడు; ఒకటి రెండు పదాల వాణిజ్య ప్రకటనలతో లక్షల కోట్ల వ్యాపారాన్ని నిలబెట్టవచ్చని నిరూపించినవాడు…ఇలా ముప్పయ్యేళ్ళుగా నాకు తెలిసిన పీయూష్ పాండే గురించి ఎంతయినా రాయవచ్చు. నేనెప్పుడూ ఆయన్ను కలవలేదు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. కానీ నాకతను బాగా పరిచయం. నిత్యం మాట్లాడుతూనే ఉంటాడు. నాలాగా కొన్ని కోట్లమంది భారతీయులతో నలభై ఏళ్ళపాటు మాట్లాడాడు.
దేశంలో ఎన్నెన్నో పేరు మోసిన యాడ్ ఏజెన్సీలున్నాయి. ఏటా వేల కోట్ల వ్యాపారం చేసే అంతర్జాతీయ యాడ్ ఏజెన్సీలకు భారత్ లో శాఖలు కూడా ఉన్నాయి. కానీ…ఒక యాడ్ ఏజెన్సీ సృజనాత్మక విభాగం అధిపతి(క్రియేటివ్ హెడ్) కన్నుమూస్తే దేశంలో ప్రధాని, దిగ్గజ పారిశ్రామికవేత్తలు మొదలు చిన్న చిన్న యాడ్ ఏజెన్సీల యజమానులదాకా ఇలా ఎప్పుడైనా నివాళులు అర్పించారా? సేవలను తలచుకున్నారా? లేదే. అదే పీయూష్ పాండే ప్రత్యేకత.

భారతీయ ప్రకటనల రంగానికి దువ్విన మీసం- పీయూష్. ప్రపంచ యాడ్ యవనికపై మెరిసిన మెరుపు- పీయూష్. భారతీయ యాడ్ సామ్రాజ్యానికి కట్టని జైపూర్ కోట- పీయూష్. స్వతహాగా క్రికెట్ క్రీడాకారుడు. రచయిత. నటుడు. హాస్యచతురుడు. మెత్తటి మనిషి. సరదా సరదాగా మాట్లాడే పని రాక్షసుడు. అన్నిటికీ మించి అణువణువునా భారతీయతను నింపుకున్నవాడు.
కొందరు అద్భుతంగా పాడగలరు. కానీ ఆ సంగీత లక్షణ శాస్త్రం గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేరు.
కొందరు అద్భుతంగా ఆడగలరు. కానీ ఆ ఆటకు సంబంధించిన మెళకువలను ఒక విద్యగా చెప్పలేరు.
కొందరు బాగా రాయగలరు. కానీ ఆ రాతకు సంబంధించిన రచనా శిల్పాన్ని వివరించలేరు.
కొందరు అద్భుతమైన వ్యూహాన్ని రూపొందించగలరు. కానీ ఆ వ్యూహాన్ని అంచెలంచెలుగా ఎలా నిర్మించారో వ్యూహ ప్రణాళికను అకడమిక్ గా వివరించలేరు.
అలా కొందరు ప్రకటనను తయారు చేయగలరు. కానీ ఆ ప్రకటన తయారీలో ప్రతి అక్షరం, ప్రతి దృశ్యం వెనుక ఉన్న ప్రణాళికను వివరించలేరు.

పీయూష్ అలా కాదు. రాసే ప్రతి పదం ఎందుకో చెబుతాడు. తీసే ప్రతి దృశ్యం దేనికో చెబుతాడు. దిగ్గజ కంపెనీలు అతడికిచ్చిన సర్టిఫికెట్ ఏమిటంటే-
“అతడు వస్తాడు…
వింటాడు…
రాస్తాడు…
తీస్తాడు…
…అంతే. మిగిలింది చరిత్ర”
పద్మశ్రీ మొదలు ఎన్నో పురస్కారాలు పొందినవాడు. Pandeymonium (పాండేమోనియం); ఓపెన్ హౌస్ విత్ పీయూష్ పాండే పుస్తకాలు రాసినవాడు. అతను లూనా మోపెడ్ ఎక్కితే మనమంతా అదే లూనా ఎక్కేలా చేసినవాడు. అతను “హమారా బజాజ్” అంటే దేశమంతా హమారా బజాజ్ అంటూ బజాజ్ తప్ప ఇంకో బండిని కొనకుండా చేసినవాడు. అతను ఫెవికాల్ రాస్తే ఇప్పటిదాకా మనం అతుక్కుని ఉండేలా చేసినవాడు. అతను తీర్చిదిద్దిన అమ్మాయి ఉత్కంఠ పోరుగా సాగే క్రికెట్లో గ్రౌండ్ మధ్యలోకి క్యాడ్బరీ తింటూ వెళ్ళగానే మనక్కూడా క్యాడ్బరీ తినాలనిపించేలా చేసినవాడు. నీరసానికే నీరసమొచ్చే ప్రభుత్వ ప్రకటనల్లో “పోలియో నిర్మూలనకు రెండు చుక్కలు” అంటూ అమితాబ్ చేత అనితరసాధ్యంగా చెప్పించి ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించినవాడు.

1955లో జైపూర్లో పుట్టి 2025 అక్టోబర్ 24న బాంబేలో కన్నుమూసిన పాండేకు స్మృత్యంజలిగా ఆయన పనిచేస్తున్న “ఓగిల్వీ” అంతర్జాతీయ యాడ్ ఏజెన్సీ ఇంగ్లిష్ పత్రికల్లో ఇచ్చిన ఫస్ట్ పేజ్ యాడ్ లో ఇలా అంటోంది:-
“ఒక పేజీలో పీయూష్ పాండే గురించి చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? మండే సూర్యుడిని ఒక చిన్న పెట్టెలో బంధించగలమా?
అతను-
ఒక ఆలోచనల పుట్ట.
నవ్వుల ప్రవాహం.
పల్లవించే పాట.
అక్షరదీపాలు వెలిగించే రచయిత.
ఇల్లూ వాకిలి, కుటుంబానికి ప్రాణమిచ్చే మనిషి.
అతడే ఒక సైన్యం.
సైన్యాన్ని నడిపించే సేనాని.
హిందీ పరవశం.
మెలిపెట్టిన మీసం…”

ఓగిల్వీకి మించి ఫెవికాల్ కంపెనీ పీయూష్ పాండేకు ఇచ్చిన నివాళి, విలువ ఇంకా హృద్యంగా ఉంది. అది మాటల్లో చెబితే అర్థమయ్యేది కాదు. భాషలో మాటలు మోయలేని భావాన్ని చెప్పే పీయూష్ కు అదే స్థాయి వ్యక్తీకరణ ఇది. ఫెవికాల్ పేరు మీద పీయూష్ పాండే ట్రేడ్ మార్క్ మీసం మొలిచింది. అంతే. యాడ్లో మిగతాభాగమంతా ఖాళీ.
చాట్ బోట్ ఏ ఐ లే యాడ్స్ రాసే, తీసే ఈ కాలంలో ఆ ఖాళీని పూరించే యాడ్ మ్యాన్ పాండేలు పుడతారా! పుట్టినా లోకం బతకనిస్తుందా?
భారతీయ సమైక్యతా గీతం “మిలే సుర్ మేరా తుమ్హారా” రాసిన పాండేతో గొంతు కలపని భారతీయుడు భారతీయుడే కాదు.

ముప్పయ్ సెకన్ల ప్రకటనలో నూట యాభై కోట్ల హృదయాన్ని ప్రతిఫలింపజేయగల పాండే భారతీయత, భాషాసామర్థ్యం, భావనాబలం, సృజనాత్మకతలు కోటికొక్కరిలో స్ఫూర్తి నింపినా కనీసం ఈ దేశంలో మరో 150 మంది పాండేలు కొత్తగా పుడతారు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

