భగవంతుడి లీలలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆ లీలల్లో తప్పనిసరిగా మనం అందిపుచ్చుకోవాల్సిన ఎన్నెన్నో సందేశాలుంటాయి. అర్థం చేసుకోవాల్సిన కర్మ సిద్ధాంతాలుంటాయి. జ్ఞానవైరాగ్య సూత్రాలుంటాయి.
ఈమధ్య ఒక ఆదివారం మా బంధువు పుట్టినరోజు. మధ్యాహ్నం భోజనానికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక పేరుమోసిన వెజ్ హోటల్ కు వెళదామని వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపులో సాదర ఆహ్వానం అందింది. కాబట్టి వంటమనిషికి సెలవు ప్రకటించి…మూడు నాలుగు కుటుంబాలవాళ్ళం వేళకు చేరుకున్నాం. కారు పార్కింగ్ కు చోటు లేదు. నిలుచోవడానికి చోటు లేదు. రెసెప్షన్లో అన్నార్తులకోసం టేబుళ్ళు కేటాయించడానికి ఒకతను రాసుకుంటున్నాడు. మా పేరు రాసుకుని అరగంట నిరీక్షించాలన్నాడు. ఇసుకవేస్తే రాలనట్లున్న ఆ రిసెప్షన్ పదడుగుల చోట్లో అప్పటికే యాభై మంది ఆవురావురుమంటూ…అన్నమో రామచంద్రా! అంటూ నిలుచుని ఉన్నారు. వారికి మేమూ తోడయ్యాము. ఒక్కొక్క పేరు పిలుస్తుంటే మా పేరు తరువాత పిలిస్తే బాగుణ్ణు అని అన్నపూర్ణాదేవికి మొక్కుకున్నాం. పొద్దున టిఫిన్ సరిగ్గా తినలేదు…ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయని నా భార్య కుర్చీలో వాలిపోయి కళ్ళు తేలేస్తున్నప్పుడు…లోకంలో ఎవరూ ఇళ్ళల్లో వండుకోవట్లేదా అని మరొక బంధువు కూర్చోవడానికి చోటు లేక విసుగ్గా గోడకు అనుకుని డీలాపడ్డప్పుడు…మా పేరు పిలిచారు.

సోమాలియా శరణార్థులకోసం ఐక్యరాజ్యసమితి వారు మైకులో పిలిచి ఆహారం పొట్లాలు పంచుతున్నప్పటి దృశ్యం ఎందుకోగానీ నాకు పదే పదే గుర్తొచ్చింది. లక్షాధికారైనా లవణమన్నమేగానీ మెరుగు బంగారంబు మింగబోడు అన్న కవి శేషప్ప పద్యం గుర్తొచ్చి రాగి సంకటి ఆర్డర్ ఇచ్చాను. మా టేబుల్ పక్కన గాజు గ్లాసు అవతల తినడానికి టేబుళ్ళు ఖాళీలేక నిరీక్షిస్తున్నవారిని చూస్తూ తినడంలో ఏవేవో నైతిక సమస్యలు వెంటాడుతుండగా తల వంచుకుని…సిగ్గుతో…త్వరగా తిని…బయటపడ్డాము. బయట మధ్యాహ్నం ఎండ తగ్గి సాయంత్రం సూర్యుడు తొంగి చూస్తున్నాడు. అయినా ఇసుక వేస్తే రాలని జనం అలాగే ఉన్నారు. బీ పీ లు, షుగర్లు ఉన్నవారు ఇతరుల భుజాలపై వాలి ఉన్నారు. పిల్లలు ఆకలిని నిగ్రహించుకుని దీనంగా ఉన్నారు. ఇంకో చోటికి వెళ్లినా ఇలాగే ఉంటుందన్న వైరాగ్యంతో వెళ్ళలేక రోడ్డుమీద అలాగే పిలుపుకోసం నిరీక్షిస్తూ ఉండిపోయినవారున్నారు. తిని బయటికొస్తున్నవారిలో తృప్తిలేదు. తినడానికి వెళ్లాల్సినవారిలో ఉత్సాహం లేదు. “అడుక్కు తినేవారికి మనకూ తేడా ఏమిటి?” అని ఒక నవయువకుడు అతడి మిత్రుడిని అడిగాడు. వాళ్ళనెందుకు అవమానిస్తావ్ అనవసరంగా… మన పరిస్థితి వాళ్ళకంటే ఘోరం అని ఠకీమని చెప్పిన అతడి సమాధానంలో నాకు ఆరు ఆనందవర్ధనుల ధ్వనులు, పన్నెండు శ్లేషలు, ఇరవై నాలుగు వ్యంగ్యాలు ఒక్కసారిగా ధ్వనించాయి.

“చేయి చాచి…యాచించే వేళ విశ్వరూపుడయినా వామనుడు కావాల్సిందే” అని వేయిపడగల్లో విశ్వనాథవారి ఓదార్పు మాట గుర్తుకు తెచ్చుకుని కారెక్కాను.
“అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో!” అని దాశరథి డెబ్బయ్, ఎనభై ఏళ్ళ కిందట బాధపడ్డాడు. ఇలాంటి హోటళ్ళ రుచి మరిగాక ఇంకెన్నాళ్ళయినా అన్నార్తులుండని ఆ నవయుగం రాదని తెలిసిపోయింది.
“రుచి లేకపోయినా పరవాలేదు…ఖాళీగా ఉన్న హోటల్ కే వెళ్ళాలి” అని వరి- మట్టి వ్యవసాయ శాస్త్రవేత్త అయిన మా బంధువు అందరికీ వినిపించేలా గట్టిగా అంది. “చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు” అన్న సామెత గుర్తొచ్చి… వినపడని నా కుడిచెవిని ఒకసారి తడిమి చూసుకున్నాను.
నాలుకమీదే రుచి…గొంతులో పడ్డాక సర్వం ఒకటే. “ఆకలి రుచి ఎరుగదు- నిద్ర సుఖమెరుగదు” అన్న సామెతను నిజం చేయడానికి భగవంతుడి లీలలివి అనుకుంటూ ఇల్లు చేరాము.
డబ్బు పెట్టి తినబోయే చోట దిక్కులేని అక్కుపక్షుల్లా నిరీక్షిస్తూ నిలుచోవడం;
ఆశీర్వదించడానికి పెళ్ళికి వెళ్ళి చేతిలో మోయలేని బరువు పళ్ళెం పట్టుకుని సంతలో తప్పిపోయిన పిల్లాడిలా మెతుకులకోసం క్యూల్లో దీనంగా ఉండడం పూర్వజన్మ పాపఫలంలా అనిపిస్తాయి నాకు. అదే విషయాన్ని ఒకసారి ప్రఖ్యాత పండితుడు అప్పజోడు వెంకటసుబ్బయ్యగారితో అంటే- “కర్మ ఫలం దేవుడైనా అనుభవించాల్సిందే. తప్పించుకోవడానికి వీల్లేదు. లోకమే ఒక భిక్షా పాత్ర. ఏ పూటకాపూట అడుక్కు తినడమే దాని నైజం. ఆది భిక్షువే మనకు ఆదర్శం” అని సకల వేదాంత సారాన్ని అడుక్కుతినడానికి అన్వయించి అద్భుతంగా చెప్పారు. సార్ నేనేదో అవమానంలో, నిస్పృహలో అలా అంటే మీరు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నిట్లో అడుక్కోవడం తప్ప ఇంకేమీ లేదన్నట్లు చెబుతున్నారు అని బుంగమూతి పెట్టాను. “అనుభవిస్తేనే కర్మ క్షయమవుతుంది” అని అన్నమో రామచంద్రా!” అని నిరీక్షించడంలో ఉన్న పరమార్థాన్ని మరింతగా విశ్లేషించి చెప్పారు. “అన్నపూర్ణ కొలువై ఉన్న కాశీలో సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన వ్యాసుడికే వారం రోజులు అన్నం దొరకలేదు నాయనా! నువ్వెంత? నేనెంత? అన్నంకోసం మన నిరీక్షణ ఎంత?” అన్నారు. మహాపండితుడిని కదిలిస్తే మహాపరాధమని తెలిసి…ఆ క్షణం నుండి అన్నంకోసం అలమటించే ప్రతిక్షణంలో కాశీఖండంలో వ్యాసుడి ఆకలి బాధను వర్ణించిన శ్రీనాథుడి సీసపద్యాలను మననం చేసుకుంటూ…అప్పజోడువారన్నట్లు కర్మఫలం క్షయమవుతోందని సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకైనా మంచిదని ప్రతి శుక్రవారం పొద్దున పూజలో “కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ! అమ్మా! వేళకింత అన్నం పెట్టు తల్లీ!” అని ప్రాధేయపడుతున్నాను.

కొస మెతుకు:-
“అన్నపూర్ణే సదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే!
జ్ఞాన-వైరాగ్య-సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!”
అమ్మా అన్నపూర్ణా! జ్ఞానం, వైరాగ్యం కలగడంకోసం నాకు వేళకింత అన్నం పెట్టు తల్లీ! అని శంకరుడు అన్నపూర్ణా స్తోత్రం చివర ఫలశ్రుతిలో స్పష్టంగా అడిగాడు. ఈ హోటళ్ళవాళ్ళు ఆ వైరాగ్యాన్నే ఇలా కలిగిస్తున్నారనుకుంటే శంకరుడు చెప్పినట్లు జ్ఞానానికి జ్ఞానం! వైరాగ్యానికి వైరాగ్యం!!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

