Saturday, November 23, 2024
HomeTrending Newsచిన్న రైతుల సాగు వ్యయం తగ్గాలి: ప్రధాని

చిన్న రైతుల సాగు వ్యయం తగ్గాలి: ప్రధాని

Golden Jubilee of ICRISAT: వాతావరణంలో మార్పులు రైతులకు సమస్యగా మారాయని, దీనిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో కూడా మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో 80 శాతానికి పైగా ఉన్న చిన్న, సన్నకారు రైతుల సాగు వ్యయం  తగ్గించేలా పరిశోధనలు ఉండాలని సూచించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్ ను ఆవిష్కరించారు. రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్ మెంట్ ఫెసిలిటీని, ఆ ప్రాంగణంలో వివిధ పరిశోధనా కేంద్రాలను ప్రారంభించారు. శాస్త్రవేత్తలు తయారుచేసిన పలు కొత్త వంగడాలను ప్రధాని పరిశీలించారు. ఫోటో గ్యాలరీ, స్టాళ్ళ ను పరిశీలించారు. పరిశోధనల వివరాలను శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. వ్యవసాయరంగాన్ని రైతులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దడంలో ఇక్రిశాట్ విజయవంతమైందని ప్రధాని కొనియాడారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ  చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

⦿ వసంత పంచమి రోజున స్వర్ణోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది
⦿ 50 ఏళ్ళు అంటే ఒక సుదీర్ఘమైన కాలం
⦿ ఈ యాభై ఏళ్ళల్లో ఇక్రిశాట్ ఎన్నో విజయాలు సాధించింది.
⦿ వ్యవసాయ రంగంలో.. నీరు, మట్టి మేనేజ్మెంట్ పై అద్భుత ఆవిష్కరణలు చేశారు
⦿ వ్యవసాయాన్నిబలోపేతం చేయడంలో, తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరగడంలో ఇక్రిశాట్ కృషి ఎంతగానో ఉంది
⦿ వ్యవసాయరంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు కృషి చేయాలి
⦿ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశ పెట్టాం

⦿ డిజిటల్ అగ్రికల్చర్ తో వ్యవసాయంలో పెను మార్పులు
⦿ వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించబోతున్నాం
⦿ సేంద్రీయ వ్యవసాయంపై రైతులు మరింత దృష్టి సారించాలి
⦿ సాగునీటి ఇబ్బందులున్న ప్రాంతాలపై ఇక్రిశాట్ దృష్టి పెట్టాలి
⦿ వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలు సృష్టించాలి
⦿ వ్యవసాయంలో 25 ఏళ్ళ లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం
⦿ ఇక్రిశాట్ కూడా ప్రత్యేక లక్ష్యాలతో పరిశోదనలు సాగించాలి
⦿ దేశంలోని 170 జిల్లాల్లో కరువు పరిస్థితులున్నాయి
⦿ దేశంలో 80 శాతం సన్నకారు రైతులే ఉన్నారు
⦿ చిన్న రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారు, చిన్న రైతుల సాగు వ్యయం తగ్గించాల్సిన అవసరం ఉంది
⦿ సాగుపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయి
⦿ వాతావరణ మార్పులతో ప్రకృతి విపత్తులు వస్తున్నాయి
⦿ వాతావరణ మార్పులపై ఫోకస్ చేయాలని ప్రపంచ దేశాలకు కూడా విజ్ఞప్తి చేశాం

ఈ కార్యక్రమంలో ప్రధాని తో పాటు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డా. జాక్వెలిన్ హ్యూస్  పాల్గొన్నారు.

Also Read : ఇక్రిశాట్ లో ప్రధాని మోడీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్