చెస్ యూత్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద భారత దేశ యువ శక్తికి నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కితాబిచ్చారు. గత వారం అజెర్ బైజాన్ లోనిబాకులో ముగిసిన ఫిడే వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ లో ప్రజ్ఞానంద రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నేడు తన తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేష్ బాబులతో కలిసి ఢిల్లీలోని రోడ్ నంబర్ 7 , లోక్ కళ్యాణ్ మార్గ్ లో ప్రధాని నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. తనకు లభించిన ట్రోఫీని మోడీకి చూపించారు. ప్రజ్ఞానందను మోడీ సాదరంగా స్వాగతించి ముచ్చటించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.
“ఇవాళ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ కు ప్రత్యేక అతిథులు వచ్చారు, ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులను కలుసుకోవడం చాల సంతోషంగా ఉంది. భారత దేశ యువ శక్తి ఏ రంగంలోనైనా ఎలా రాణిస్తుందని చెప్పడానికి మీరు నిదర్శనం, నిన్ను చూసి గర్విస్తున్నా” అంటూ మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మహీంద్రా కంపెనీ అధినేంత ఆనంద మహీంద్రా XUV400 EV కారును ప్రజ్ఞానందకు బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 30 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు.