అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి 14 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఈ ఉదయానికి మరో నలుగురు అసువులు బాశారు. మరో 41 మంది తీవ్ర గాయాల పాలై సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొలుత రియాక్టర్ పేలుడువల్ల ఈ ఘటన జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ రియాక్టర్ కారణం కాదని, సాల్వెంట్ లీకవడం వల్లే ప్రమాదం జరిగిందని దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన ఏపీ ఫ్యాక్టరీస్ విభాగం నిర్ధారించింది. ప్రమాదం జరిగిన వెంటనే మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టాయి, శిథిలాల తొలగింపు కోసం అధికారులు భారీ క్రేన్లు తెప్పించారు. అర్థరాత్రి సమయానికి శిథిలాల తొలగింపు పూర్తి చేశారు.
కాగా, మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, క్షతగాత్రులకు వారి గాయాల తీవ్రతను బట్టి 50 లక్షల వరకూ పరిహారం అందిస్తామని కలెక్టర్ హరిందర్ ప్రసాద్ ప్రకటించారు. అయితే వెంటనే పరిహారం అందించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తూ కలెక్టర్ ను అడ్డుకున్నాయి. ఎసెన్షియా కంపెనీపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.