దేశ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు చివరి గ్రామాలు కాదని ఇక నుంచి అవి దేశంలోనే మొదటి గ్రామాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరాఖండ్ లో రోప్ వే ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి మరింత జరుగుతుందన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా..ఈ రోజు (శుక్రవారం) వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి, కొత్త ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత చమోలి జిల్లాలోని ..మన..గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ది ద్వారా యువత ఆలోచనలు అభివృద్ధి పథంలో సాగుతాయని ప్రధానమంత్రి అన్నారు.
3400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. దాంతోపాటు 9.7 కి.మీ పొడవైన గౌరీకుండ్-కేదార్‌నాథ్, గోవింద్ ఘాట్ నుంచి హేమకుండ్ సాహిబ్ రోప్‌వే ప్రాజెక్ట్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బద్రీనాథ్ చేరుకుని నదితీర వెంబడి అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకున్నారు మోదీ. అనంతరం అరైవల్ ప్లాజా, సరస్సుల సుందరీకరణ ప్రాజెక్టు పురోగతిని ప్రధానమంత్రి సమీక్షించారు.
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి…పూజలు కూడా చేశారు. అనంతరం జగద్గురు ఆదిశంకరాచార్య సమాధిని కూడా సందర్శించారు. అక్కడ నుంచి బద్రీనాథ్‌కు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ చేరుకున్న మోదీకి రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్, సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘనస్వాగతం పలికారు. ప్రధాని టూర్ సందర్భంగా కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను క్వింటాళ్ల కొద్ది పూలతో అలంకరించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హిమాలయ రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.