రైతులకు మరింత గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సిఎం జగన్ ఆశయాలు, ఆశల మేరకు రైతుల జీవన విధానం మరింత పురోగతి సాధించేలా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతు అసలైన శాస్త్రవేత్త అని, ప్రయోగాలు చేసే అర్హత వారికే ఉందని అన్నారు.
విజయవాడలో అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అవకాశాలపై నిర్వహించిన సెమినార్ కు మంత్రి కాకాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు వద్దకే అన్ని రకాల సేవలూ అందిస్తున్నామని చెప్పారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించేలా ఆలోచనలు చేయాలని, దీనికోసమే అధికారుల సమన్వయంతో ఈ సెమినార్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి ఘటనను పోలీసులు విచారిస్తున్నారని, నిందితులు ఎవరో తేలకముందే టిడిపి నేతలు సజ్జల, తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.