Thursday, March 28, 2024
HomeTrending Newsపోలీసుల సేవలు వెలకట్టలేనివి - సిఎం కెసీఆర్

పోలీసుల సేవలు వెలకట్టలేనివి – సిఎం కెసీఆర్

పౌరుల భద్రత, నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసుల త్యాగం అజరామరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. “పోలీసు అమరవీరుల సంస్మరణ దినం” (అక్టోబర్ 21) సందర్భంగా అమరులైన పోలీసులకు సిఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల త్యాగాలను సిఎం స్మరించుకున్నారు.
విధి నిర్వహణ కోసం ప్రాణాలనైనా అర్పించేందుకు సిద్ధపడే పోలీసుల త్యాగం, దేశ రక్షణ కోసం పోరాడే సైనికుల త్యాగాలతో సమానమైనవన్నారు. కుటుంబాలకు దూరంగా, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా, అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివన్నారు. ప్రశాంత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో,శాంతి భధ్రతల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలపడంలో పోలీసుల పాత్ర గొప్పదని సిఎం అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. అందుకు హోం మంత్రిని, రాష్ట్ర పోలీసు శాఖను, డిజిపిని, పోలీసు ఉన్నతాధికారులను సిబ్బందిని సిఎం కేసీఆర్ అభినందించారు.


శాంతి భధ్రతల పరిరక్షణతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల సమాచార సమన్వయం కోసం, దేశానికే ఆదర్శంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని సిఎం తెలిపారు. కమాండ్ సెంటర్ ద్వారా అమలులోకి తెచ్చిన అత్యున్నత సాంకేతికతను రాష్ర్ట పోలీసులు అందిపుచ్చుకుని సేవలందిస్తున్నారని, ఈ క్రమంలో దేశంలోనే అత్యుత్తమ పోలీసులుగా తెలంగాణ పోలీసులు నిలిచారని సీఎం అన్నారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సహచర పోలీసు అమరుల త్యాగాల స్ఫూర్తితో విధి నిర్వహణకు పునరంకితం కావాలని రాష్ట్ర పోలీసులకు ఈసందర్భంగా సిఎం కెసీఆర్ పిలుపునిచ్చారు. పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సిఎం పునరుద్ఘాటించారు. పోలీసుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్