సాధారణంగా కిడ్నాపులు డబ్బు కోసమే జరుగుతాయి. అందుకే డబ్బున్న మారాజులు సెక్యూరిటీ పెట్టుకుంటూ ఉంటారు. మరి పేదింటి వారి సంగతి?
వారి పిల్లలు కిడ్నాప్ అయితే పట్టించుకుంటారా?
ఆ బాబు వయసు రెండునెలలు మాత్రమే. తల్లిదండ్రులు కోటీశ్వరులు కాదు. రోడ్డుపక్కన చెత్త ఏరుకుంటూ మురికివాడలో ఉంటారు. మరి వారి చిన్నారికి పొలీసు కాపలా ఎందుకు అవసరమైంది?
గుజరాత్ లోని అదాలజ్ ప్రాంతంలో నివసిస్తూ చెత్త ఏరుకుని జీవించే దంపతులకు గాంధీనగర్ సివిల్ ఆస్పత్రిలో బాబు పుట్టాడు. రెండోరోజే అపహరణకు గురయ్యాడు. వారం లోపే పోలీసులు నిందితులను పట్టుకుని బాబుని తల్లిదండ్రులకు అప్పగించారు. బాబును ఎత్తుకెళ్లిన జంటకు పిల్లలు లేరని విచారణలో తేలింది.
హమ్మయ్య అనుకుని బాబుతో సహా తల్లి రోజువారీ చెత్త సేకరణకు సైకిల్ రిక్షాపై వెళ్తూ ఉండేది. ఈ విషయం గమనించారు మరో పిల్లలు లేని దంపతులు. ఒకరోజు బాబుని రిక్షాలో పెట్టి తల్లి చెత్త సేకరణకు వెళ్ళగానే మోటారుసైకిల్ పై వచ్చి మళ్ళీ బాబుని ఎత్తుకు పోయారు. తల పట్టుకున్న పోలీసులు విస్తృతంగా గాలింపులు జరిపారు. సుమారు 700 సీసీ టీవీ కెమెరాలు జల్లెడ పట్టారు. చివరకు నిందితుల్ని పట్టుకున్నారు. బిడ్డని తల్లి ఒడికి చేర్చారు. కానీ మరోసారి ఇలా జరిగితే అని ఆలోచించారు. చిన్నారికి ఇరవైనాలుగు గంటలూ పోలీసు కాపలా కల్పించారు.
అంతే కాదు బిడ్డ తల్లిదండ్రులకు ఉపాధి, చక్కటి నీడ కల్పించే ఆలోచన కూడా చేస్తున్నారట పోలీసు మామయ్యలు.