తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువ గళం పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులను పోలీసు శాఖ మంజూరు చేసింది. తాము సూచించిన నిబంధనలకు లోబడి యాత్ర చేసుకోవాలని సూచించింది.
- ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు
- బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన సమయానికి కట్టుబడి ఉండాలి
- ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదు.
- రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదు
- ఆరోగ్య, అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి బహిరంగ సభా ప్రదేశంలో తగిన ఏర్పాట్లు చేయాలి, వైద్య పరికరాలతో అంబులెన్సులు ఏర్పాటు చేయాలి
- అగ్నిమాపక యంత్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి
- బాణసంచా పేల్చడం నిషేధం
- సమావేశంలో పాల్గొనేవారు, హాజరయ్యేవారు ఎలాటి మారణాయుధాలు తీసుకెళ్ళకుండా నాయకులే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
- నిర్వాహకులు డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులకు సహకరించాలి, ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలి
- శాంతి భద్రతల నిర్వహణలో, ట్రాఫిక్ నియంత్రణలో సహకరించాలి
అంటూ పోలీసులు అనుమతి పత్రంలో పేర్కొన్నారు.
ఈ అనుమతి పత్రాన్ని జిల్లా ఎస్పీ టిడిపి నేతలు అమర్ నాథ్ రెడ్డి, పులివర్తి నానిలకు అందజేశారు. కుప్పంలో సాగే మొదటి మూడురోజుల పాదయాత్రను పలమనేరు డీఎస్పీ పర్యవేక్షించనున్నారు.
అయితే ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు పాటించడం సాధ్యం కాదని తెలుగుదేశం పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, తాము అనుకున్న మేరకు ముందుకు వెళతామని వెల్లడించారు. తాము నిబంధనల మేరకే పాదయాత్ర చేస్తామని తాము మొదట్లోనే పోలీసు శాఖకు చెప్పామని, యాత్ర అనుకున్న సమయానికి తొలి అడుగు పడుతుందని టిడిపి నేత వర్ల రామయ్య స్పష్టం చేశారు.
Also Read : లోకేష్ పాదయాత్రకు అనుమతి