Friday, November 22, 2024
HomeTrending Newsహుజురాబాద్ లో ఎన్నికల వేడి

హుజురాబాద్ లో ఎన్నికల వేడి

హుజురాబాద్ లో రాజకీయ పార్టీలు క్రమంగా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో నేతల్ని మొహరించాయి. కాంగ్రెస్ మినహా ప్రధాన పార్టీల తరపున ఎవరు బరిలోకి దిగుతారో క్లారిటీ వస్తోంది. ఇన్నాళ్ళు ఉపఎన్నికలు వన్ సైడ్ వార్ అన్నట్టుగా సాగాయి. ఉపఎన్నికలు అంటేనే తెరాస గెలుపు ఖాయం అనే నానుడికి దుబ్బాక ప్రజలు చెక్ చెప్పారు. దుబ్బాక గుణపాఠంతో గులాబి నేతలు ఏ చిన్న అవకాశం కూడా వదులుకోవటం లేదు. నాగార్జునసాగర్ లో సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి గులాబి దండు ఓటమి రుచి చూపెట్టింది. సాగర్ గెలుపుతో హుషారు మీదున్న కారు అదే జోరు హుజురాబాద్ లో కొనసాగించాలని చూస్తోంది.

బిజెపి తరపున ఇప్పటికే ఈటెల  రాజేందర్ పాదయాత్ర చేస్తూ ప్రచారంలో అందరి కన్నా ముందు ఉన్నారు.  హుజురాబాద్ లోనే మకాం వేసిన ఈటెల – నేతలు చేజారకుండా, అనుచరుల్ని కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు. ఆయనకు తోడుగా మాజీ ఎంపిలు జితేందర్ రెడ్డి, వివేక్ లు హుజురాబాద్ లోనే ఉండి బిజెపి శ్రేణులకు ప్రచారంపై దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే  హుజురాబాద్ లో నేను పోటి చేసినా రాజేందర్ పోటీ చేసిన ఒకటే అని ఈటెల  భార్య జమున ఇటీవల చేసిన నర్మగర్భ  వ్యాఖ్యలపైన చర్చోప చర్చలు జరుగుతున్నాయి. కెసిఆర్ ఎత్తులు దగ్గరి నుంచి చూసిన ఈటెల అంతకు పై ఎత్తుకు సిద్దం అయ్యాడులా ఉంది.   ఉపఎన్నికల ప్రకటన రాగానే సమయానుకూలంగా తను పోటీ చెయాలా, తన భార్యను పోటీకి దింపాల నిర్ణయించే అవకాశం ఉంది.

హుజురాబాద్ లో కారు స్పీడు ఎలా ఉంటుందో చూపాలని గులాబీ దళం ప్రణాలికలు సిద్దం చేస్తోంది. నిన్న మొన్నటి వరకు పార్టీ అభ్యర్థులు ఎవరు అనేది సందిగ్ధంగా ఉండేది. భారీ అనుచరగణంతో తరలి వచ్చిన కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించక పోయినా ఉన్న వారిలో కౌశిక్ రెడ్డి రేసులో ముందున్నారు. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, గెల్లు శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నా ఈటెల రాజేందర్ కు దీటుగా కౌశిక్ రెడ్డి సరైన అభ్యర్థి అని పార్టీ వర్గాలు అంటున్నాయి.  పార్టీ అభిమానులు, సాంప్రదాయ ఓట్లతో పాటు రెడ్డి వర్గం పూర్తి స్థాయిలో కౌశిక్ రెడ్డి కి సహకరిస్తుందని, గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, సానుభూతి కూడా అక్కరకొస్తుందని పార్టీ అంచనాగా ఉంది.

హుజురాబాద్ విషయంలో అందరి కన్నా గుంబనంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. పిసిసి అధినేతగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ నేతలు సమరోత్సాహంతో ఉన్నారు. ఇన్నాళ్ళు నైరాశ్యంలో ఉన్న పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు రేవంత్ రాకతో కెసిఆర్ ను ఎదుర్కునే నాయకుడు వచ్చాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  అభ్యర్థి ఎవరైనా హస్తం జెండా రెప రెప లాడించాలని పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ గా దామోదర రాజనరసింహతో పాటు మండలాల వారిగా నేతలకు పిసిసి తరపున బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ నేతలు హడావిడి లేకుండా గ్రామాల్లో ప్రచారం చేస్తూ, ఇన్నాళ్ళు పార్టీతో  అంటీముట్టనట్టుగా ఉన్న నాయకుల్ని కలుపుకుపోతున్నారు.

హుజురాబాద్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా తేలలేదు. ఏ ఎన్నికలైనా ప్రకటన రాక ముందే అభ్యర్థుల పేర్లు బయటకు రావటం, బాహాటంగానే తామే అభ్యర్థులమని చెప్పుకోవటం కాంగ్రెస్ లో సహజంగా జరుగుతుంది. ఆ విధంగా  హుజురాబాద్ లో ఎవరు ప్రకటనలు చేయటం లేదు. కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ను పోటీ చేయించాలని పార్టీ నేతల ఆలోచనగా ఉంది. పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంతంలో సుపరిచితుడు. ఎన్.ఎస్.యు.ఐ నేతగా, కరీంనగర్ ఎంపి గా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలోని ప్రతి మండలంలో నేతలు, క్షేత్ర స్థాయి కార్యకర్తలతో పొన్నం సంబంధాలు కొనసాగిస్తున్నారు.

అటు కొందరు నేతలు మరో కొత్త పేరు తెరమీదకు తీసుకొస్తున్నారు. మాజీ మంత్రి,  తెలుగు దేశం దివంగత నేత ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు ముద్దసాని కశ్యప్ రెడ్డిని పోటీ చేయించాలని పార్టీ అధిష్టానానికి సూచిస్తున్నారు. కశ్యప్ రెడ్డి పోటీ చేస్తే తెలుగుదేశం ఓటు బ్యాంకుకు తోడు కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు జత అవుతాయని లెక్కలు వేస్తున్నారు. కొందరు నేతలు కశ్యప్ రెడ్డిని సంప్రదించినట్టు సమాచారం. కొన్నాళ్ళు వేచి చూస్తే కాని కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది తేలేలా లేదు.

తెలంగాణ రాజకీయాలు ఇపుడు హుజురాబాద్ కేంద్రంగా సాగుతున్నాయి. ఉప ఎన్నికల ప్రకటన వెలువడక ముందే హుజురాబాద్ లో ఎన్నికల వేడి పెరిగింది. తెరాస, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సమఉజ్జీలను దింపి పోటీని రసవత్తరంగా మార్చే పనిలో ఉన్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్