Saturday, April 20, 2024
HomeTrending Newsమహిళలు త్యాగమూర్తులు: సిఎం జగన్

మహిళలు త్యాగమూర్తులు: సిఎం జగన్

మహిళలు కుటుంబ బరువు మోసే త్యాగమూర్తులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. 45 నుంచి 60 యేళ్ల వయసులో అత్యంత బాధ్యతాయుతంగా ఉండే అక్క, చెల్లెమ్మలకు సహాయం చేస్తే అది నేరుగా కుటుంబానికే ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతోనే వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపునేస్తం పథకాలను ప్రవేశ పెట్టామని వెల్లడించారు.

వైఎస్సార్ కాపు నేస్తం రెండో ఏడాది ఆర్ధిక సహాయాన్ని క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సిఎం జగన్ జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్ధిక సాయం అందింది.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా రూ. 15 వేలు చొప్పున 5 సంవత్సరాలు రూ.75 వేలు అక్కచెల్లెమ్మల చేతిలో పెడితే తమ కాళ్ళ మీద వారు కచ్చితంగా నిలబడగలుగుతారనే గొప్ప ఆలోచనలోంచి ఈ పథకం పుట్టిందని వెల్లడించారు. ఇందులో మొట్టమొదటిగా వైఎస్సార్ చేయూత ద్వారా ప్రతి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశామని, 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లు పాటు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామన్నారు. అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబననే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు.

వైయస్సార్‌ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45–60 సంవత్సరాల వయస్సులో ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మకు ఐదేళ్ల కాలంలో రూ.15వేలు చొప్పున రూ.75వేలు నేరుగా వాళ్ల చేతుల్లోనే పెడుతున్నామన్ని, తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేస్తామని చెప్పకపోయినా కూడా ఇది చేస్తే బాగుంటుందని అమలు చేస్తున్నామని వివరించారు. నిండు మనస్సుతో కాపు అక్క,చెల్లెమ్మలకు మంచి జరగాలని చేపట్టిన కార్యక్రమమని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్