Sunday, January 19, 2025
HomeTrending Newsఅధికార కాంక్షతో కులాలు, మతాల మధ్య చిచ్చు..జీవన్ రెడ్డి

అధికార కాంక్షతో కులాలు, మతాల మధ్య చిచ్చు..జీవన్ రెడ్డి

అధికారకాంక్షతో కులాల పేరిట, మతాల పేరిట జాతిని విచ్ఛిన్నం చేస్తున్న మతతత్వ శక్తులను అడ్డుకుని, భారత జాతిని ఐక్యం చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత జాతిని ఏకం చేసేందుకు చేపట్టిన భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ కార్గే కు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పాటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామన్నారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తన చివరి రక్తం బొట్టు వరకు జాతి ఐక్యత కోసం కృషి చేశారని గుర్తు చేశారు. మూడు దశాబ్దాల క్రితం దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్న శక్తులను అడ్డుకునేందుకు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశవ్యాప్తంగా సద్భావన యాత్ర చేపట్టారని అన్నారు. జగిత్యాలలో ఈ రోజు భారత్ జొడో యాత్ర పోస్టర్  పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…బిజెపి పాలనపై దుమ్మెత్తి పోశారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికార లక్ష్యంతో జాతీయ విడదీయాలని కుట్రలు కుతంత్రాలు మతవిద్వేషాలను రెచ్చగొడుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. యూపీఏ పాలనలో గ్రామీణ నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టామని, నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చామని, పారదర్శకమైన పాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం ప్రవేశపెట్టామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బిజెపి ప్రభుత్వం మాత్రం యూపీఏ పాలనలోని పథకాలను నిర్వీర్యం చేస్తూ, కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ పద్దం గడుపుకుంటూ ఉందని ధ్వజమెత్తారు.

దేశవ్యాప్తంగా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. నూతన ఉద్యోగాల కల్పన దేవుడు ఎరుగు.. తెలంగాణలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా యూపీఏ పాలనలో ఏర్పాటు చేసిన ఐటిఐఆర్ ను సైతం టిఆర్ఎస్ పాలనలో బిజెపి రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదల ఖాతాల్లో 15 లక్షల చొప్పున జమ చేస్తామన్న మాట మరిచారన్నారు. బిజెపి పాలనలో ధరల పెంపుతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలోనీ టిఆర్ఎస్ వంత పాడుతోందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడంతో బిజెపితో విభేదాలున్నట్లు ప్రజలను నమ్మించేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తుందని అన్నారు. 2014 నుండి 2020 వరకు బిజెపి ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం సమర్ధించిందని మత స్వేచ్ఛకు భంగం వాటిల్లే ట్రి పుల్ తలాక్ ను కూడా టిఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని అన్నారు.

కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మెట్పల్లి జెడ్పిటిసి కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిరాజుద్దీన్ మన్సూర్, మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్, తాటిపర్తి దేవేందర్ రెడ్డి, గాజుల రాజేందర్, జగదీశ్వర్, రాధా కిషన్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

Also Read : గాంధీలకు విశ్వాసపాత్రుడు..ఖర్గే

RELATED ARTICLES

Most Popular

న్యూస్