Saturday, January 18, 2025
HomeTrending Newsతాలిబాన్ల ఏలుబడిలో ఆఫ్ఘన్లో దుర్భిక్షం

తాలిబాన్ల ఏలుబడిలో ఆఫ్ఘన్లో దుర్భిక్షం

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టాక ప్రజల జీవన ప్రమాణాలు అంతకంతకు దిగజారుతున్నాయి. దేశంలో దుర్భిక్షం తాండవిస్తోంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు ఆ దేశం నుంచి బిచానా ఎత్తేశాయి. దీంతో ప్రజలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. అనేక మందికి సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. దేశంలో అత్యవసర వైద్యం కోసం సరైన సదుపాయాలు లేవు. డ్రై ఫ్రూట్ వ్యాపారంతో గతంలో అనేక మందికి ఉపాధి లభించేది. ఇప్పుడు తాలిబాన్ల భయానికి విదేశీ వ్యాపారులు కాబుల్ వైపు కన్నెత్తి చూడటం లేదు.

గుడ్డిలో మెల్ల మాదిరిగా సాగుతున్న చివరి రెండు ఆన్లైన్ షాపింగ్ సంస్థలు చేతులు ఎత్తేశాయి. క్లిక్.ఏఎఫ్ ఆన్లైన్ షాపింగ్ సంస్థ తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ప్రకటించిన మరుసటి రోజే బకాల్ ఆన్లైన్ కంపనీ తాము కూడా కాబుల్ వీడుతున్నట్టు ప్రకటించింది. ఆర్ధిక ఇబ్బందుల వల్లే వ్యాపారం చేయలేకపోతున్నామని రెండు సంస్థలు వివరించాయి. తాలిబాన్లు ఏలుబడిలోకి వచ్చాక తొలినాళ్ళలోనే బుబార్ టాక్సీ సర్వీస్ ఆన్లైన్ సేవలు నిలిపివేసింది. అదే సమయంలో  హిందూకుష్ ఆన్లైన్ కంపెనీ మూతపడి.. ఉపాదిలేక వేలమంది రోడ్డున పడ్డారు.

ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం సుమారు రెండున్నర కోట్ల మంది ప్రజలు తిండిలేక అలమటిస్తున్నారని అంచనా. తాలిబన్లు అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు ప్రపంచ దేశాలు అధికారికంగా తాలిబాన్ల పాలనను, ప్రభుత్వాన్ని గుర్తించటం లేదు. దీంతో అంతర్జాతీయంగా ఆఫ్ఘన్ కు ఎలాంటి ఆర్ధిక సాయం అందటం లేదు. ఓ వైపు కరువు, మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్