Saturday, November 23, 2024
HomeTrending Newsభారత్ లో డిజిటలైజేషన్... తగ్గిన పేదరికం - UN

భారత్ లో డిజిటలైజేషన్… తగ్గిన పేదరికం – UN

భారత్‌లో డిజిటల్ విప్లవాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. డిజిటల్ విప్లవం గత ఐదారేళ్లలో భారత  దేశంలో అనేక మార్పులకు దారితీసిందని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. 80 కోట్ల మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి విముక్తి పొందారని వెల్లడించారు. అందుకు ప్రభుత్వ చొరవ ఎంతో ఉందని ప్రశంసించారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాల్ని వెల్లడించారు. భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాకింగ్‌ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తం చేశారు.

‘డిజిటలైజేషన్‌ దేశం వేగవంతమైన అభివృద్ధికి దోహదం చేస్తుందని.. ఉదాహరణకు భారత్‌నే తీసుకోండి.. గత ఐదారేళ్లలోనే స్మార్ట్‌ఫోన్‌ల వాడకం ద్వారా 800 మిలియన్ల (80 కోట్ల మంది) మంది భారతీయులను పేదరికం నుంచి బయటపడేయగలిగింది. గతంలో భారత్‌ గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో లేవు. ఇప్పుడు గ్రామీణ రైతులకు చెల్లింపులు,   అందుకోవడం, బిల్లులు చెల్లించడం వంటివి స్మార్ట్‌ఫోన్ ద్వారానే చిటికెలో చేసేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసి, దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి భారత్‌లో ఇంటర్‌నెట్‌ వ్యాప్తి ఎంతగానో తోడ్పడుతోంది. మిగిలిన దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితి పొంతన లేని సర్వేలతో వెనుకబడిన దేశాలను, ఆయా దేశాల ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందనే అపవాదు ఉంది. పాశ్చాత్య దేశాలు, కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా పనిచేస్తోందని UN పై ఆరోపణలు ఉన్నాయి. డిజిటల్ విప్లవంతో బ్యాంకింగ్ సేవలు సులభతరం అయ్యాయని చెప్పకుండా… పేదరికం తగ్గిందని తప్పుడు విశ్లేషణలు చేయటంపై ఆర్థిక రంగ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వాలు అందించే నగదు చెల్లించటం ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఈ విధమైన సేవలు ప్రభుత్వాలు అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగంతోనే పేదరికం తగ్గిందని.. విశ్వసనీయత లేని విశ్లేషణ చేయటం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో కార్పొరేట్ శక్తులు ఉహించని స్థాయిలో బలోపేతం అవుతున్నాయి. పేదలు మరింత దారిద్రంలో కూరుకుపోతున్నారు. 144 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని యుఎన్ చెపుతోంది. అదే జరిగితే హపినేస్ ఇండెక్స్ లో 126 స్థానంలో ఎలా ఉందని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

కార్పొరేట్ శక్తులను కాపాడేందుకు… దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి వివరాలు యుఎన్  చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్