ఎస్వీఆర్ అభినయం అనితర సాధ్యం: పవన్ కళ్యాణ్‌

“తెలుగు చలనచిత్రాన్ని పరిపుష్టం చేసిన మహానటుల్లో అగ్రగణ్యులు శ్రీ ఎస్.వి.రంగారావు గారు. చిన్నపాటి మాటను ప్రభావశీలమైన హావభావంతోనో… కఠిన సమాసాలతో కూడిన ఎంత పెద్ద సంభాషణనైనా అలవోకగా పలికి మొత్తం సన్నివేశాన్ని రక్తి కట్టించిన ప్రతిభాశీలి శ్రీ ఎస్.వి.ఆర్. నేడు ఆయన జయంతి సందర్భంగా ఏ మాధ్యమంలో చూసినా ఆయన నటించిన చిత్రాలు… వాటి విశేషాలే. వాటిని చూస్తుంటే ఎస్వీఆర్ గారు మన సినిమా పై ఎంతటి బలమైన ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు” అని పవన్ కళ్యాణ్ తెలియచేశారు.

“ఈ సందర్భంగా శ్రీ ఎస్వీఆర్ గారిని స్మరించుకొంటూ వారికి నా తరఫున, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నాను. పౌరాణికం, చారిత్రకం, జానపదం, సాంఘికం… ఏ తరహా పాత్ర పోషించినా వారి అభినయం అనితర సాధ్యం. నిండైన ఆయన రూపం ప్రతి తెలుగువాడి మదిలో చిరస్థాయిగా నిలిచే వుంది అన్నారు. ప్రతినాయకుడిగా… క్యారెక్టర్ నటుడిగా… ఏ పాత్రకైనా జీవం పోసి ఆ పాత్రకు ఎస్వీఆర్ గారు తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు అనే విధంగా చేశారు. కాబట్టే నేటికీ ఘటోత్కచుడిగా.. కీచకుడిగా… నేపాళ మాంత్రికుడిగా… హిరణ్యకశిపుడిగా… అక్బర్… భోజరాజు.. తాండ్ర పాపారాయుడు… తాతామనవడు తాతగా… ఏ పాత్రలో అయినా ఎస్వీఆర్ మాత్రమే గుర్తుకొస్తారు. ఒక నటుడిగా శ్రీ ఎస్వీఆర్ గారు చిరకీర్తిని ఆర్జించారు. ఆయనను రాబోయే తరాలు కూడా స్మరించుకొంటూనే ఉంటాయి” అని పవన్ కళ్యాణ్‌ తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *